పర్వతగిరి(గీసుగొండ), వెలుగు : గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాదని, గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మరియపురం లోని ఎస్.ఎస్. ఫంక్షన్ హాల్‌లో గురువారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికపై జిల్లాలోని ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 99 రోజుల ప్రణాళిక ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు.
ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం ఇటీవల మరణించిన గంగదేవిపల్లి మాజీ సర్పంచి కూసం రాజమౌళికి సంతాపంగా మౌనం పాటించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట, నర్సంపేట చైర్పర్సన్ లు సారంగపాణి, పెండ్యాల లక్ష్మీ, ఈ స్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ , డిఎఫ్ ఓ అనుజ్ అగర్వాల్ పాల్గొన్నారు.
