సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం : మంత్రి కోమటిరెడ్డి

సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం : మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, వెలుగు : రాజకీయాలకు అతీతంగా అధికారులు, ప్రతినిధులు కలిసి పనిచేస్తేనే పేదల సంక్షేమం సాధ్యమవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా పరిషత్  మీటింగ్​ హాల్​లో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  మున్సిపల్ పట్టణాల్లో పారిశుధ్యం, వేసవి తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలని, పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు.

డిసెంబర్ 9 నాటికి ‘స్కూళ్లు’ ప్రారంభిస్తాం..

రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, నల్గొండలో నిర్మాణంలో ఉన్న పాఠశాలను డిసెంబర్ 9 నాటికి ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. సర్పంచులు రానున్న ఐదేళ్ల కాలంలో గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, అన్ని వర్గాల వారు ఒకే చోట చదువుకునేలా ఈ పాఠశాలలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

రవాణా రంగం అభివృద్ధిలో భాగంగా రూ.10,400 కోట్లతో హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు, అలాగే రూ.320 కోట్లతో నల్గొండ-ధర్వేశిపురం రహదారి పనులకు టెండర్లు పిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.