ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి సాగు అంచనా.. 5,65,043 ఎకరాలు

ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి సాగు అంచనా.. 5,65,043 ఎకరాలు
  • అత్యధికంగా నిర్మల్​ జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో సాగుకు సిద్ధం
  • దుక్కులు దున్నుతున్న రైతులు
  • వ్యవసాయ పనుల్లో బిజీబిజీ
  • అందుబాటులో ఎరువులు 

ఆసిఫాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజన్ పనులు ఆరంభమయ్యాయి. వరి కోతలు పూర్తికావస్తుండడంతో వ్యవసాయ బావుల, ప్రాజెక్టు కింద రైతులు వరి నార్లు పోస్తున్నారు. మరికొందరు దుక్కులు దున్నుతూ వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొందరు నాట్లు వేస్తున్నారు. వర్షాధారం కింద పత్తి పంట సాగు చేసిన భూముల్లో జొన్న, శనగలు సాగు చేస్తున్నారు.

ఈ సీజన్​లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,65,043 ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. యాసంగిలో ఎక్కువ శాతం బావులు, బోర్ల పైనే సాగు ఆధారపడి ఉంటుంది. ఈసారి వర్షాలు అనుకూలంగా కురవడం, 24 గంటలు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుండటంతో ఎక్కువ మంది రైతులు పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు.

ఈసారైనా కలిసి వస్తుందని ఆశతో..

వానాకాలంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు యాసంగి అయినా కలిసి వస్తుందని గంపెడాశలతో సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఎప్పట్లాగే ఈసారి కూడా ఎక్కువగా వరి సాగు చేయనున్నారు. తర్వాత జొన్న సాగుకు ప్రయారిటీ ఇస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పలు షాపుల్లో డీలర్లు విత్తనాలను  అందుబాటులో ఉంచారు.

భారీ స్థాయిలో వరి, జొన్న సాగు

యాసంగి సీజన్​లో ఆసిఫాబాద్ ​జిల్లాలో 50,216 పంటలు సాగు కానున్నాయి. ఇందుకోసం 88,120 బస్తాల్లో 3,965 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. 90,968 బస్తాల్లో 4,094 మెట్రిక్ టన్నుల యూరియాను అధికారులు అందుబాటులో ఉంచారు. డీఏపీ 1964 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 541 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. కాంప్లెక్స్ 1361 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా 2060 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచారు. నిర్మల్ జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 1.2 లక్షల ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, 60 వేల ఎకరాల్లో శనగ, 20 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నారు.

40 వేల ఎంటీఎస్​ల యూరియా అవసరం కాగా ఇప్పటికి 22 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఆదిలాబాద్​జిల్లాలో మొత్తం 1.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. యాసంగిలో వరి సాగుచేయని రైతులు భారీ స్థాయిలో జొన్నలు పండిస్తారు. ఈసారి 10,9301ఎకరాల్లో జొన్న సాగుచేయనున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు డీలర్లు, సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ గోదాములలో యూరియా నిల్వ ఉంచారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి యూరియా పంపిణీ కేంద్రాల ద్వారా అందజేయనున్నారు. 

ఆదిలాబాద్ జిల్లా            ఎకరాలు

జొన్న                          10,9301

శనగలు                      36,464 

కంది                            2,186

మొక్క జొన్న               15,130

ఇతర పంటలు              2,483

మొత్తం                         1,65,564 

మంచిర్యాల జిల్లా         ఎకరాలు

వరి                                       25,056

మొక్క జొన్న                      6,405

జొన్నలు                               336

పప్పు ధాన్యాలు                  453

పండ్లు, పూల తోటలు      16,114

కూరగాయలు                   784

మొత్తం                            49,263

ఆసిఫాబాద్​ జిల్లా             ఎకరాలు

వరి                             23,463 

జొన్న                         13,550

మొక్కజొన్న              4,234

శనగలు                     3,691

కూరగాయలు             941

ఇతర పంటలు         4371

మొత్తం                      50,216