ఎంబీబీఎస్ అడ్మిషన్లలో తేడా వస్తే ఊరుకునేది లేదని, రూల్స్ మీరి అడ్మిషన్లు ఇస్తే ఒక్కో సీటుకు ఏకంగా రూ. కోటి జరిమానా విధిస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీలను హెచ్చరించింది. నీట్ మెరిట్, కౌన్సెలింగ్ లేకుండా మేనేజ్ మెంట్లు ఇష్టారాజ్యంగా సీట్లు ఇస్తే అవి చెల్లవని పేర్కొంది.
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ అడ్మిషన్లలో తేడా వస్తే ఊరుకునేది లేదని, రూల్స్ బ్రేక్ చేస్తే అడ్మిషన్లు ఇస్తే ఒక్కో సీటుకు ఏకంగా రూ. కోటి జరిమానా విధిస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీలను హెచ్చరించింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ఫస్టియర్లో చేరిన స్టూడెంట్ల వివరాలను జనవరి 15 అర్ధరాత్రిలోపు ఎన్ఎంసీ పోర్టల్లో అప్లోడ్ చేయాలని డెడ్లైన్ విధించింది. నీట్ మెరిట్, కౌన్సెలింగ్ లేకుండా మేనేజ్మెంట్ ఇష్టారాజ్యంగా సీట్లు ఇస్తే అవి చెల్లవని, భారీ జరిమానాతో పాటు వచ్చే ఏడాది సీట్లలో కోత విధిస్తామని తేల్చి చెప్పింది. పారదర్శకత కోసం అడ్మిట్ అయిన వారి వివరాలను కాలేజీ వెబ్ సైట్లోనూ పెట్టాలని స్పష్టం చేసింది.
ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై పరిమితి ఎత్తివేత
ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సీట్లు పెంచుకోవాలంటే ఒకేసారి 100 సీట్లకు మించి అప్లై చేయొద్దు అనే రూల్ను ఎత్తేసింది. ఈ మేరకు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సీట్ల లిమిట్ తీసేసినా.. ఫీజులు మాత్రం భారీగా పెంచేసింది.
కొత్త కాలేజీలు, సీట్ల పెంపు కోసం అప్లై చేసుకునేవాళ్లు ఇకపై రూ. 2 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు 18 శాతం జీఎస్టీ కచ్చితంగా కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఇది నాన్ -రీఫండబుల్ అని, రెగ్యులర్ అప్లికేషన్ ఫీజుకు ఇది అదనమని చెప్పింది. అలాగే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ పాత ఫార్మాట్లో ఉన్నా చెల్లుతుందని, పర్మిషన్ లెటర్ (ఎల్వోపీ) వచ్చాకే కార్పస్ ఫండ్ వివరాలు ఇస్తే సరిపోతుందని ఎన్ఎంసీ క్లారిటీ ఇచ్చింది.
