మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు: చేపల వేట విషయంలో ఇరువర్గాల మత్స్యకారుల మధ్య వాగ్వాదం నెలకొంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణా పరివాహక ప్రాంతమైన రేబల్లె గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికేతరులు గ్రామంలో ఉంటూ నదిలో చేపల వేట సాగిస్తూ, తమ జీవనోపాధిని దెబ్బకొడ్తున్నారంటూ కొంత కాలంగా వివాదం నడుస్తోంది.
ఈ విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో మంగళవారం జిల్లా ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ ఉపేందర్, స్థానిక ఆఫీసర్లతో కలిసి గ్రామంపంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇరు వర్గాల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తుండగానే వారి మధ్య మాటామాట పెరిగింది. లైసెన్సులు, రెసిడెన్సీ సర్టిఫికెట్లు లేకుండానే చేపల వేట కొనసాగిస్తున్నారని ఓ వర్గం ఆరోపించగా, తమకు లైసెన్సులు ఉన్నాయని మరో వర్గం ఎదురు దాడికి దిగింది.
గ్రామపంచాయతీ ఆఫీస్ తలుపులు మూసి ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఫీల్డ్ ఆఫీసర్ ఉపేందర్ మాట్లాడుతూ.. మత్స్యకారులంతా ఇక నుంచి కొత్త లైసెన్సులు తీసుకోవాలని సూచించారు. స్థానిక రెసిడెన్సీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు సమర్పించాలన్నారు.
అప్పటి వరకు నదిలోకి చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. ధిక్కరిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఆయన మాట్లాడుతుండగానే స్థానిక మత్స్యకారులు గ్రామంలో ధర్నాకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేందర్ రెడ్డి, ఎంపీడీవో రామచందర్ రావు, ఎంపీవో భూపాల్ రెడ్డి ఉన్నారు.
