
- చేతి'వాటా'లతో రగడ
- నెల రోజుల్లో నాలుగు చోట్ల వివాదం
సిద్దిపేట, వెలుగు: మహిళా గ్రూపుల్లో సభ్యులకు తెలియకుండా లక్షల్లో రుణాలు తీసుకోవడం వివాదంగా మారుతోంది. గజ్వేల్ మున్సిపాలిటీలో అరకోటికి పైగా గోల్‌మాల్ వ్యవహారం బయటపడగా.. సిద్దిపేట మున్సిపాలిటీలో లోన్ల వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. ఐదు మున్సిపాలిటీల పరిధిలో 4,200 గ్రూపుల్లో దాదాపు 43 వేల మంది మహిళా సభ్యులుండగా, డీఆర్డీఏ పరిధిలో 18 వేల సంఘాల్లో 1.93 లక్షల మంది సభ్యులున్నారు. లోన్ల మంజూరు విషయంలో మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొందరు గ్రూపు లీడర్లతో పాటు క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆర్పీ, సీవోలు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రుణాలను పక్కదారి పట్టిస్తున్నారు.
గజ్వేల్‌లో రచ్చరచ్చ
గజ్వేల్ మున్సిపాలిటీకి చెందిన శివశంకర్, నెహ్రూ, లీలశ్రీతో పాటు మరికొన్ని డ్వాక్రా గ్రూపుల్లో పరిచయం లేని వ్యక్తుల పేర్లను నమోదు చేసి గ్రూపు పేర్లు మార్చి తమ పేరుపై లోన్లు తీసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మెప్మాలో పనిచేసే ఆర్పీ రూ. 50 లక్షలకు పైగా తమకు తెలియకుండా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీఓ ఒత్తిడి వల్లనే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆర్పీ లిఖితపూర్వకంగా అధికారులకు వివరణ ఇవ్వడం కలకలం సృష్టిస్తోంది. మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య మాట్లాడుతూ.. మహిళా గ్రూపు లోన్ల విషయంపై విచారణ ప్రారంభించామన్నారు.
సిద్దిపేటలో ఇద్దరిపై వేటు
సిద్దిపేట మున్సిపాల్టీలో సభ్యులకు తెలియకుండా కొత్త గ్రూపును ఏర్పాటు చేసి రుణం తీసుకునే ప్రయత్నం బయటపడటంతో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. పట్టణంలోని నాసర్ పురాకు చెందిన ఒక గ్రూపు సభ్యులతో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని 60 సంవత్సరాలు పైబడినందు వల్ల గ్రూపు నుంచి తొలగించాలని కోరుతున్నట్లు మున్సిపాలిటీలో దరఖాస్తు అందజేశారు. వీరిని గ్రూపు నుంచి తొలగించి కొత్త పేర్లను యాడ్ చేసి ఫోర్జరీ సంతకాలతో రుణం పొందాలని ప్రయత్నించారనే విషయం వెల్లడి కావడంతో సీఓతో పాటు టౌన్ మిషన్ ఇన్‌చార్జి హెడ్డాఫీసుకు ఇద్దరు అధికారులను అటాచ్ చేశారు.
బేగంపేటలో రెండు లక్షల గోల్ మాల్
బెజ్జంకి మండలం బేగంపేట లోని వర్థిని మహిళా గ్రూపునకు సంబందించి సీఓ మహిళలతో సంఘం గ్రూప్ తెల్ల కాగితంపై సంతకం తీసుకుని అప్పటికే గ్రూపుకు ఐదు లక్షల లోన్ ఉండగా మరో రెండు లక్షల రుణం తీసుకుని వాటిని తన ఖాతాలో వేసుకుంది. మరో ఆరు సంఘాల్లో ఇదే విధంగా రుణాల గోల్ మాల్ జరిగినట్లు ఆఫీసర్లు గుర్తించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన పుల్లూరు మహిళలు
సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామంలోని కనకదుర్గా మహిళా సంఘంలోని ఇద్దరు లీడర్లు నాలుగేళ్లగా రుణాలు తీసుకుని మోసం చేశారని గ్రూపు సభ్యులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన సీఓ సైతం సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కనకదుర్గ గ్రూపునకు సంబంధించి స్త్రీనిధి లోన్ 4 .77 లక్షలు, వెలుగులో 2.80 లక్ష తో పాటు మొత్తంగా రూ. 11 లక్షలు వాడుకున్నారు.
దీంతో సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌తో పాటు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. అడిషనల్ డీఆర్డీవో మధుసూదన్ మాట్లాడుతూ గ్రూపు లీడర్ల లో ఒకరి ఆరోగ్యం బాగాలేనందున విచారణ పూర్తి కాలేదన్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిన తరువాత పూర్తి సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు.