టాలీవుడ్ నటుడు ‘జోష్’ రవి ఇంట్లో విషాదం

టాలీవుడ్ నటుడు ‘జోష్’ రవి ఇంట్లో విషాదం

‘జోష్’ సినిమాతో నటుడిగా గుర్తింపుగా తెచ్చుకున్న ‘జోష్’ రవి ఇంట్లో విషాదం నెలకొంది. అతని తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ ఉన్నట్టుండి హార్ట్ అటాక్ రావడంతో చనిపోయారు. రవి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు గ్రామం. రవి తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారు. రవి సినిమాలు చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటున్నాడు. కార్తీక మాసం కావడంతో మూడో కార్తీక మాసం సందర్భంగా.. శివాలయంలో అభిషేకం చేయడానికి రవి తల్లిదండ్రులు ఆలయానికి వెళ్లారు.

అక్కడే రవి తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. హుటాహుటిన ఆయనను హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సౌమ్యుడిగా పేరున్న ‘జోష్’ రవి తండ్రి ఇక లేరనే వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు సిటీలో ఉంటూ దూరంగా ఉంటున్నా.. భర్తతో కలిసి సొంతూరిలో ఉంటున్న ‘జోష్’ రవి తల్లి.. భర్త లేడనే విషయం జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు.

హైదరాబాద్ నుంచి జోష్ రవి కూడా సొంతూరు వెళ్లాడు. గత వారమే గుండెపోటు కారణంగా ‘జోష్’ రవి తండ్రి చనిపోయారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘జోష్’ రవి జబర్తస్త్ షోలో కొన్ని స్కిట్లు కూడా చేసిన సంగతి తెలిసిందే. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు ?’ షోలో చిరంజీవి ముందే ఆయన నటించిన కొన్ని సినిమాల్లోని పాత్రలను ఇమిటేట్ చేసి చిరంజీవితోనే శభాష్ అనిపించుకున్న నటుడు ఈ ‘జోష్’ రవి. టాలీవుడ్లో చాలా సినిమాల్లో కమెడియన్ పాత్రల్లో నటించి మెప్పించిన ‘జోష్’ రవిలో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడు.