సింగరేణి కొత్త గనులు ప్రారంభించాలి: ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్

సింగరేణి కొత్త గనులు ప్రారంభించాలి:   ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్
  •     ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్​

గోదావరిఖని, వెలుగు: సింగరేణి మనుగడ కోసం వెంటనే కొత్త గనులను ప్రారంభించాలని, సంస్థకు రావాల్సిన రూ.51 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌‌కుమార్ డిమాండ్​ చేశారు. 

ఆదివారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ‘సేవ్ సింగరేణి పోరు జాత’ కార్నర్ మీటింగ్‌‌లో వారు మాట్లాడారు. కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. రాజకీయ జోక్యంతో కొత్త గనుల ప్రారంభం నిలిచిపోయిందని, ప్రస్తుత గనులు మూసివేత దశకు చేరుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా సంస్థను బలహీనపరుస్తోందని విమర్శించారు. ఏసీబీ విచారణ పేరుతో నిలిపివేసిన మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని, మారుపేర్లు, విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో ఒప్పుకున్న డిమాండ్లను అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఏప్రిల్‌‌లో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఎల్లాగౌడ్, వీరభద్రం, వైవీ రావు, ముస్కె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.