
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ గురించి చెప్పాలంటే అందరికీ బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ మ్యాచ్ గుర్తుకొస్తుంది. ఇంగ్లాండ్ పర్యటనలో రెండో టెస్ట్ తర్వాత ఈ టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఒక్కసారిగా సంచలనంగా మారాడు. ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించడంలో ఈ బెంగాల్ పేసర్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తన ఫాస్ట్ బౌలింగ్ తో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ద్వారా ప్రపంచ క్రికెట్ కు తానేంటో నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్ ల్లో వార్తల్లో నిలిచిన ఆకాష్.. తాజాగా శనివారం (ఆగస్టు 9) కొత్త కార్ ఒకటి కొని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాడు.
ఇటీవలే ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ముగించుకున్న ఆకాష్ తన "కలల కారు"ను కొనుగోలు చేసి తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తన కుటుంబంతో కలిసి కొత్త కారుతో ఫోటో దిగిన ఆకాష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "కల నెరవేరింది. కీస్ అందాయి. అత్యంత ముఖ్యమైన వారితో" అనే శీర్షిక పోస్ట్ చేశాడు. కారు నలుపు రంగులో ఉన్న టయోటా ఫార్చ్యూనర్. ఈ కార్ టాప్ మోడల్ ధర రూ.62 లక్షలకు పైగా ఉంటుంది. ఈ పోస్ట్ వైరల్ అయిన వెంటనే, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ "కార్ చాలా బాగుంది". అని తన విషెష్ తెలిపాడు.
2024 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా చివరి మూడు టెస్టుల్లో ఆకాష్ దీప్ తొలి సారి భారత టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. తొలి రెండు టెస్టులకు ఎంపికైన ఆవేశ ఖాన్ స్థానంలో ఆకాష్ దీప్ కు చోటు దక్కింది. ఆకాష్ దీప్ అంతకముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ ఆడాడు. 7 మ్యాచ్ ల్లో 6 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి 29 మ్యాచ్ ల్లోనే 103 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 4 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. భారత్ తరపున ఇప్పటివరకు 10 టెస్టుల్లో 28 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
A moment of joy for Akash Deep and his family as they welcome their new car.🚗✨ pic.twitter.com/tI4qQ4yPGE
— CricTracker (@Cricketracker) August 9, 2025