పేపర్ల లీకేజీ, నిరుద్యోగుల సమస్యలపై స్పందించకపోతే..ఇండ్లు ముట్టడిస్తం

పేపర్ల లీకేజీ, నిరుద్యోగుల సమస్యలపై స్పందించకపోతే..ఇండ్లు ముట్టడిస్తం
  • పేపర్ల లీకేజీ, నిరుద్యోగుల సమస్యలపై స్పందించకపోతే
  • మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తం
  • రాష్ట్ర సర్కారుకు అఖిలపక్ష నేతల అల్టిమేటం
  • లీకేజీ పాత్రధారులు, సూత్రధారులు ప్రగతి భవన్​లోనే ఉన్నరు: ఆర్​ఎస్​ ప్రవీణ్ 
  • కేసు విచారణ దశలో ఉండగా పరీక్షలకు కొత్త  డేట్లు  ఎట్లిస్తరని నిలదీత
  • ఇంత జరుగుతున్నా సీఎం ఎందుకు స్పందిస్తలే: ప్రొఫెసర్​ కోదండరాం
  • లక్షల మంది ఇబ్బంది పడుతుంటే పాలకులకు పట్టదా?: ప్రొఫెసర్​ హరగోపాల్
  • ఇది ధర్మయుద్ధం.. క్రిమినల్ పొలిటీషియన్ ను ఓడించాలి: గద్దర్​
  • కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డయ్:  ఆకునూరి మురళి
  • పెద్ద తలలను తప్పించేందుకే సిట్​ వేసిన్రు: మల్లు రవి
  • ధర్నా చౌక్​ వద్ద  ‘నిరుద్యోగుల గోస.. అఖిలపక్ష భరోసా’ దీక్ష

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ ఇష్యూలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని, సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజులు టైమ్ ఇస్తున్నామని, అప్పటిలోగా స్పందించకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇండ్లు ముట్టడిస్తామని అల్టిమేటం ఇచ్చారు. పోరాటాన్ని ఆపేది లేదని, రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్​ వద్ద  ‘నిరుద్యోగుల గోస.. అఖిల పక్ష భరోసా’ పేరుతో దీక్ష జరిగింది.  వివిధ పార్టీల నేతలు, మేధావులు, ప్రొఫెసర్లు, నిరుద్యోగులు, స్టూడెంట్లు హాజరయ్యారు. టీజేఎస్​ చీఫ్​ ప్రొఫెసర్​ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, బీఎస్పీ స్టేట్​ చీఫ్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి, పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్  మల్లు రవి తదితరులు ప్రసంగించారు. పేపర్ల లీకేజీ వ్యవహారంలో టీఎస్​పీఎస్సీ తీరు, రాష్ట్ర సర్కారు తీరును ఎండగట్టారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా ఉద్యమాన్ని ఆపబోమని తేల్చిచెప్పారు. లక్షల మంది గోసపడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

పేపర్ లీకేజీ అంశంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, కవిత, టీఎస్ పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ, బోర్డు మెంబర్లు, నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకుంటే 5 నిమిషాల్లో దొంగలు ఎవరో బయటడతారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  అన్నారు. ‘‘ఇప్పటి వరకూ బోర్డు మెంబర్ల ఫోన్లు సిట్ అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు” అని ప్రశ్నించారు. పేపర్ లీకేజ్ అంశంపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నేతలంతా కలిసి జంగ్ సైరన్ మోగిద్దామని, ఇది ఆరంభం మాత్రమేనని, ముందు ముందు పోరాటాలు ఉదృతం చేద్దామని పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీ బయట పడకపోతే మరో 30 ఏండ్లు పేపర్లు లీకయ్యేవని, దర్జాగా నిందితులు సర్కారు కొలువుల్లో సెట్ అయ్యేవారని ఆయన అన్నారు. ‘‘నిరుద్యోగులు, విద్యార్థులు లేకపోతే తెలంగాణ లేదు. పేపర్ల లీకేజీ అంశం కమిషన్​ చైర్మన్ జనార్దన్​రెడ్డి, సెక్రటరీ, బోర్డు మెంబర్లకు ముందే తెలుసు. టీఎస్​పీఎస్సీలో పనిచేసే ప్రవీణ్​కు గ్రూప్​ 1 ప్రిలిమ్స్​లో 103 మార్కులు ఎలా వచ్చాయి? ఈ విషయం బయటకు రావడంతో జనార్దన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి.. ప్రవీణ్ క్వాలిఫై కాలేదంటూ చిన్న విషయం గా చెప్పారు. అంబేద్కర్​ జయంతి రోజు సీఎం కేసీఆర్ ను ప్రశ్నలు అడిగితే  సమాధానం చెప్పలేదు. 250 మంది సెక్యూరిటీ మధ్య సీఎం రెస్ట్ తీసుకుంటున్నడు. జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల సమ్మె పై సీఎం ఫైర్  అయితున్నడట.. ఇందిరా పార్కు దగ్గరకు సీఎం వస్తే ఎవరు ఫైర్ మీదున్నరో తెలుస్తది. పేపర్ల లీకేజీపై డీజీపీ అంజనీకుమార్, సీపీ సీవీ ఆనంద్, సిట్ చీఫ్ ఏ ఆర్ శ్రీనివాస్, టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పాలి” అని డిమాండ్​ చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. సిట్ అధికారులు టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని, శంకర్ లక్ష్మిని ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు. “టీఎస్​పీఎస్సీ మెంబర్ చంద్రశేఖర్ రావు రాజీనామా చేసిండు.. ఈ విషయం ఎవరికీ తెలియదు. మరో మెంబర్​ కారం రవీందర్ రెడ్డి బయో డేటా టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్​లో తీసేన్రు” అని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు. పేపర్ల లీకేజీలో  పాత్రధారులు, సూత్రధారులు ప్రగతి భవన్​లో, బీ ఆర్ ఎస్ లో ఉన్నారని ఆరోపించారు. కేసు విచారణ దశలో ఉండగా పరీక్షలకు కొత్త  తేదీలను ఎట్ల ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఎస్ పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మంత్రులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రగతి భవన్ కుట్రలకు నిరుద్యోగుల జీవితాలు బలయ్యాయని అన్నారు.  2008 డీఎస్సీ  బాధితులు ఎనిమిది మంది మంత్రులను కలిసినా న్యాయం జరగలేదని, ఈ ప్రభుత్వాన్ని, సీఎంను బర్తరఫ్ చేయాలని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ను దోపిడీదారుల నుంచి కాపాడుకోవాలి.. రక్షించుకోవాలి” అని పిలుపునిచ్చారు. 

ఐక్యంగా పోరాడాలి:  హరగోపాల్

పేపర్ లీక్ అయి సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే పాలకులకు భయం లేదని ప్రొఫెసర్ హరగోపాల్  అన్నారు. ఇది చావు బతుకుల సమస్య అని తెలిపారు. ‘‘తమ  పిల్లలకు జాబ్ లు వస్తయని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నరు. వారి ఆశలు పేపర్ల లీకేజీతో అడియాసలైతున్నయ్​” అని అన్నారు. పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో  ఇన్ని సమస్యలు ఉంటే పక్కనపడేసి దేశానికి నాయకుడు కావాలని ఆరాటపడుతున్నారని కేసీఆర్​ను ఆయన విమర్శించారు. 

లీకేజీలో పెద్ద తలలు: మల్లు రవి

పేపర్ లీకేజీలో పెద్ద తలలు ఉన్నాయని, ఆ కేసు నుంచి వారిని తప్పించటానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. ఇపుడున్న బోర్డును తొలగించి కొత్త బోర్డు ఏర్పాటు చేసి, ఆ బోర్డు పరిధిలోనే పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బానిసలకు , కేసులకు భయపడొద్దని, ఎంత పోరాడితే అంత మంచిదని అన్నారు. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను, ఎంపీలను అడ్డుకోవాలని ఆయన సూచించారు. పేపర్ లీకేజీలో నిరుద్యోగులు ఇంత ఇబ్బందులు పడుతుంటే భరోసా కల్పించకుండా సీఎం సైలెంట్ గా ఉన్నారని, ప్రభుత్వం తప్పు చేయకపోతే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణకు ఎందుకు వెనుకాడుతున్నదని ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. 

లెఫ్ట్ పార్టీలు పోరాటం మాని, సీట్ల కోసం ప్రయత్నిస్తున్నయ్​:  గోవర్ధన్ 

తొమ్మిదేండ్ల తర్వాత  రాష్ట్రంలో గ్రూప్-1 ఎగ్జామ్ పెడితే .. అది కూడా లీక్ అయిందని, దొంగలను కేసీఆర్​ కాపాడుతున్నారని  సీపీఐ ఎంఎల్ న్యూడ్రెమోక్రసీ నేత గోవర్ధన్ మండిపడ్డారు. పార్టీలు మధ్య భేదాలు ఉన్నా అందరూ ఒకే వేదికపైకి వచ్చారంటే పేపర్ లీకేజ్ ఎంత సీరియస్ అంశమో అర్థమవుతున్నదని అన్నారు. ప్రజా సమస్యలు, పేపర్ లీకేజీపై లెఫ్ట్ పార్టీలు పోరాటాలు చేయకుండా సీట్ల కోసం కేసీఆర్ దగ్గర ఉన్నారని దుయ్యబట్టారు. ‘‘నిరుద్యో గులు ముఖ్యమో.. కేసీఆర్ ముఖ్యమో.. లెఫ్ట్ పార్టీలు తేల్చుకోవాలి” అని ఆయన డిమాండ్​ చేశారు. నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ నేత పోటు రంగారావు అన్నారు.

అఖిలపక్షం డిమాండ్లు

  •     పేపర్ లీకేజీపై సీబీఐతో గానీ,  సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపించాలి.
  •     నష్టపోయిన ప్రతి నిరుద్యోగికి రూ.1 లక్ష పరిహారం ఇవ్వాలి.
  •     టీఎస్ పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ, మెంబర్లను తొలగించాలి
  •     కొత్త బోర్డు ఏర్పాటు చేసి, ఆ బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించాలి. 
  •     పేపర్లు లీక్​ కాకుండా సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలి.

అఖిలపక్షం డిమాండ్లు

  •     పేపర్ లీకేజీపై సీబీఐతో గానీ,  సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపించాలి.
  •     నష్టపోయిన ప్రతి నిరుద్యోగికి రూ.1 లక్ష పరిహారం ఇవ్వాలి.
  •     టీఎస్ పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ, మెంబర్లను తొలగించాలి
  •     కొత్త బోర్డు ఏర్పాటు చేసి, ఆ బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించాలి. 
  •     పేపర్లు లీక్​ కాకుండా సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలి.

క్రిమినల్ పొలిటీషియన్​ను ఓడించాలి: గద్దర్

టీఎస్​పీఎస్సీ క్వశ్చన్​ పేపర్స్ లీకేజీపై ధర్మ యుద్ధం చేస్తున్నామని, అందరూ ఐక్యంగా ఉండాలని ప్రజా గాయకుడు గద్దర్ సూచిం చారు. ‘‘బలమైన క్రిమినల్ పొలిటీషియన్ ను ఓడించాలి. ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో ఇంతకాలం కష్టపడి పరీక్షలకు ప్రిపేర్​ అయిన రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నరు. ఏండ్ల పాటు నిద్రాహారాలు మాని పరీక్షలకు నిరుద్యోగులు సిద్ధమైతే..పేపర్లు లీక్ చేసి వాళ్ల జీవితాలతో ఆడుకున్నరు” అని మండిపడ్డారు. ఆల్ పార్టీ ఆధ్వర్యంలో శాంతి యుతంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు.  నిరుద్యోగుల సమస్యలపై గద్దర్  పాట పాడారు. 

కేసీఆర్​ సర్కారుకు రోజులు దగ్గర పడ్డయ్​: ఆకునూరి మురళి

‘‘దీక్షను చూసిన తర్వాత కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గర పడినయనే విషయం అర్థమవుతున్నది.  ఈ మెసేజ్​ను ప్రగతి భవన్ కు పంపిస్తున్న” అని మాజీ ఐఏఎస్​ ఆకునూరి మురళి అన్నారు. ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్​.. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిండు. లక్షల కోట్ల కంపెనీలు, ఇండస్ర్టీస్ వచ్చాయని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. మరి, అందులో నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు? ఉద్యోగాల భర్తీపై సీఎం ఎందుకు రివ్యూ చేయటం లేదు. అధికారం నుంచి దిగగానే కేసీఆర్, ఆయన ఫ్యామిలీ చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు వెళ్లటం ఖాయం” అని హెచ్చరించారు. రైతుల భూములను కేసీఆర్​ కుటుంబం అక్రమంగా లాక్కుంటూ విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నదని ఆయన ఆరోపించారు. కనీసం పరీక్షలు కూడా సరిగా నిర్వహించటం చేత కాని స్టేజ్ లో ఈ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
-