వీసా కష్టాలు: భారత్‌లో చిక్కుకున్న అమెజాన్ ఉద్యోగులకు ఊరట.. మార్చి వరకు ఇంటి నుండే పని

వీసా కష్టాలు: భారత్‌లో చిక్కుకున్న అమెజాన్ ఉద్యోగులకు ఊరట.. మార్చి వరకు ఇంటి నుండే పని

అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్.. భారత్‌లో చిక్కుకుపోయిన తన ఉద్యోగుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా వీసా రెన్యూవల్ కోసం వచ్చి ఆలస్యం కారణంగా స్వదేశంలో ఆగిపోయిన ఉద్యోగులు.. మార్చి 2, 2026 వరకు భారత్ నుండే రిమోట్ వర్క్ చేయడానికి కంపెనీ వెసులుబాటు కల్పించింది. సాధారణంగా వారానికి 5 రోజులు ఆఫీస్ నుండి పనిచేయాలనే కఠిన నిబంధన ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెజాన్ ఈ మినహాయింపును ప్రకటించింది. దీంతో వందల మంది వీసా స్ట్రాంపింగ్ కోసం వచ్చి నిలిచిపోయి ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు ఉపశమనం లభించింది.

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత H-1B వీసా నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులే ఈ జాప్యానికి ప్రధాన కారణం. కొత్త నిబంధనల ప్రకారం వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ అదనపు స్క్రీనింగ్ వల్ల వీసా అపాయింట్‌మెంట్లు నెలల తరబడి ఆలస్యమవుతున్నాయి. కొన్ని చోట్ల ఈ గడువు ఏకంగా 2027 వరకు వెళ్లడంతో.. భారత్‌కు వచ్చిన అనేకమంది ఉద్యోగులు తిరిగి అమెరికా వెళ్లలేక ఇక్కడే ఉండిపోయారు.

అయితే భారత్ నుండి పనిచేసే ఉద్యోగులపై అమెజాన్ కొన్ని కఠినమైన ఆంక్షలు విధించింది. రిమోట్ వర్క్ చేస్తున్న సమయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఎలాంటి కోడింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. ట్రబుల్ షూటింగ్, టెస్టింగ్ లేదా డాక్యుమెంటేషన్ వంటి పనులకు కూడా అనుమతి లేదు. అంతేకాకుండా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, ఒప్పందాలపై సంతకాలు చేయడం, కస్టమర్లతో నేరుగా మాట్లాడటం వంటివి కూడా నిషేధించబడ్డాయి. అన్ని కీలక నిర్ణయాలు, ఫైనల్ అప్రూవల్స్ కేవలంఅమెరికాలో ఉన్న టీమ్ ద్వారా మాత్రమే జరగాలని కంపెనీ స్పష్టం చేసింది.

సాంకేతిక విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ నిబంధనలు పెద్ద సవాలుగా మారాయి. తమ పనిలో 80 శాతం కోడింగ్, టెస్టింగ్ మాత్రమే ఉంటుందని, అవి చేయకుండా ఖాళీగా ఉండటం కష్టమని ఉద్యోగులు అంటున్నారు. అయినప్పటికీ స్థానిక చట్టాలకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ తెలిపింది. గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులు వీసా సమస్యల రీత్యా అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికాలో అత్యధికంగా హెచ్-1బి వీసాలను ఉపయోగించుకునే కంపెనీల్లో అమెజాన్ ఒకటి కావడంతో.. తాజా పరిణామాలు కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.