గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దం.. మూడంచెల భద్రత.. ట్రాఫిక్ కు ప్రత్యేక ప్రణాళిక

గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దం.. మూడంచెల భద్రత.. ట్రాఫిక్ కు ప్రత్యేక ప్రణాళిక

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 8 నుంచి రెండు రోజుల పాటు  జరగనున్న ఈ సమిట్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది.

2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి సుమారు 600 మంది వీఐపీలు, 1,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు సదస్సు లాంఛనంగా ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఉపన్యాసం చేయనున్నారు.  సీఎంతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సు కోసం ఇప్పటికే 3 హెలిప్యాడ్‌‌‌‌లు సిద్ధం కాగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. సదస్సులో మొత్తం 4 ప్రధాన హాళ్లలో 27 అంశాలపై చర్చా గోష్టులు జరగనున్నాయి.

పటిష్ట భద్రత

సదస్సుకు వేలాదిగా తరలివస్తున్న అతిథులు, వీఐపీల భద్రత దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వేదిక వద్ద దాదాపు 1,200 మంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ కమిషనర్ కే శశాంక ఆధ్వర్యంలో 25 ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దాదాపు 2,000 మంది అతిథులు, 2,500 మంది ప్రభుత్వ అధికారులు పాల్గొనే ఈ ఈవెంట్‌‌‌‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 3 వారాలుగా సాగుతున్న సన్నాహాలు నేటితో కొలిక్కి వచ్చాయని, ఈ సదస్సు తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. 

లక్ష కోట్ల పెట్టుబడులు టార్గెట్

ఈ గ్లోబల్ సమిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రెండు రోజుల సదస్సులో దాదాపు రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంబానీ గ్రూప్ ఆధ్వర్యంలో గుజరాత్‌‌‌‌లోని ‘వంతారా’ తరహాలో భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ జూ పార్కు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది.