మిగులు వరద జలాలట! పోలవరం-బనకచర్ల లింక్‌‌పై ఏపీ మరో కొత్త వాదన

మిగులు వరద జలాలట! పోలవరం-బనకచర్ల లింక్‌‌పై ఏపీ మరో కొత్త వాదన
  • సీడబ్ల్యూసీ అభ్యంతరాలపై వివరణ ఇస్తూ లేఖ
  • 152 టీఎంసీలతో బొల్లాపల్లి రిజర్వాయర్‌‌‌‌ నిర్మాణం
  • పీబీ లింక్‌‌తో 16 ప్రాజెక్టులకు నీళ్లిచ్చేలా ప్రణాళికలు 
  • రిజర్వాయర్ల లెక్కలు ఇవ్వదట 
  • పైరాష్ట్రాలు వాడుకోని నీళ్లను తమకు వాడుకునే హక్కు ఉందని వాదన

హైదరాబాద్, వెలుగు: పోలవరం–బనకచర్ల (పీబీ) లింక్ ​ప్రాజెక్టుపై ఏపీ రోజుకో కొత్త వాదనను తెరపైకి తెస్తున్నది. మిగులు జలాలనే తీసుకెళ్తామని ఒకసారి, వరద జలాలను తరలిస్తామని ఇంకోసారి చెప్పిన ఏపీ.. ఇప్పుడు మిగులు వరద జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలిస్తామంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అసలు మిగులు జలాలే లేవని సెంట్రల్​ వాటర్​కమిషన్ (సీడబ్ల్యూసీ) చెబుతున్నా, దేశంలో వరద జలాల కాన్సెప్టే ఇప్పటి వరకు లేదని జలవనరుల నిపుణులు స్పష్టం చేస్తున్నా.. ఏపీ మాత్రం కాకి లెక్కలు చెబుతూ బుకాయిస్తున్నది. 

మిగులు, వరద జలాలనే రెండు అంశాలను కలిపి కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. పీబీ లింక్‌‌కు సంబంధించి 8 అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సీడబ్ల్యూసీ.. వాటికి వివరణ ఇవ్వాలని గత నెలలో ఏపీకి లేఖ రాసింది. సీడబ్ల్యూసీ లేవనెత్తిన అభ్యంతరాలపై ఇటీవల వివరణ ఇస్తూ ఏపీ లేఖ రాసింది. ఆ లేఖలో మిగులు వరద జలాలు తరలిస్తామని పేర్కొంది. అంతేకాదు బొల్లాపల్లి రిజర్వాయర్ ​కెపాసిటీని భవిష్యత్తులో 200 టీఎంసీలకు పెంచుకుంటామన్న కుట్రపూరిత వాదననూ లేఖలో వెల్లడించింది. 

డీపీఆర్ ప్రిపరేషన్‌‌కు ప్లానింగ్​కమిషన్​2010లో నిర్దేశించిన గైడ్‌‌లైన్స్‌‌కు అనుగుణంగానే పోలవరం బనకచర్ల లింక్​ ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొంది. పైగా పోలవరం నుంచి దిగువకు వెళ్లే మిగులు వరద జలాలను న్యాయబద్ధంగానే తరలించుకుంటామని వాదించింది. మరోవైపు 173 టీఎంసీల స్టోరేజీతో బొల్లాపల్లి రిజర్వాయర్‌‌‌‌ను నిర్మిస్తామని ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో పేర్కొన్న ఏపీ.. సీడబ్ల్యూసీకి ఇచ్చిన లేఖలో మాత్రం మాట మార్చి 152 టీఎంసీలతోనే నిర్మిస్తామని, భవిష్యత్తులో దాన్ని 200 టీఎంసీలకూ పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని తమ స్టడీల్లో తేలిందంటూ పేర్కొనడం గమనార్హం. 

రిజర్వాయర్​ రిలీజ్ డేటా అక్కర్లేదట..

గోదావరి బేసిన్‌‌లో ఏటా వివిధ రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నుంచి రిలీజ్​ చేసిన నీటి లెక్కలను సమర్పించాలని సీడబ్ల్యూసీ ఆదేశించగా.. ఏపీ మాత్రం ఇప్పుడు ఆ లెక్కలు అవసరం లేదంటూ రిప్లై ఇచ్చింది. వర్జిన్​ఈల్డ్​(వివిధ రాష్ట్రాలు వాడుకోకుండా వచ్చే నీళ్లు) లెక్కలను పరిగణనలోకి తీసుకుని.. ఆయా రాష్ట్రాల కేటాయింపులను తీసివేశాకే పీబీ లింక్​ ద్వారా తరలించే నికర జలాలపై ఓ నిర్ధారణకు వచ్చామని పేర్కొంది. 

ఎగువన రిజర్వాయర్ల ఆపరేషన్ల డేటా.. దిగువన ఉన్న గేజ్​ అండ్ ​డిశ్చార్జ్​ స్టేషన్లలో రికార్డయి ఉంటాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే డీపీఆర్​తయారు చేసే సమయంలోనే ఆయా రిజర్వాయర్ల ఆపరేషన్​షెడ్యూల్స్​, విడుదల చేసిన నీటి మొత్తం, సీజన్​ ప్యాటర్న్స్​పై వివరాలు ఇస్తామని తెలిపింది. 

అన్ని రాష్ట్రాల వినియోగం 2,191 టీఎంసీలు

గోదావరి బేసిన్‌‌లోని అన్ని రాష్ట్రాల నీటి వినియోగం 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 2,191 టీఎంసీలు ఉందని ఏపీ పేర్కొంది. అందులో తెలంగాణ, ఏపీ కలిపి 924 టీఎంసీలు వినియోగిస్తుండగా.. ఇతర రాష్ట్రాల వినియోగం 1,268 టీఎంసీలుగా ఉందని వాదించింది. కాళేశ్వరం(ప్రాణహిత జీ9) నుంచి శబరి (జీ12) వరకు ఉన్న నీటి వినియోగ వివరాలను వెల్లడించింది. జీ9 సబ్​ బేసిన్‌‌లో ఏపీ, తెలంగాణ నీటి వినియోగం 284 టీఎంసీలు కాగా.. ఇంద్రావతి (జీ11)లో 280 టీఎంసీలు, లోయర్​ గోదావరి (జీ10)లో 211, శబరి (జీ12)లో 148 టీఎంసీల వినియోగం ఉందని వివరించింది. 

అయితే ఏటా సగటు నీటి ప్రవాహాలు (50 శాతం డిపెండబిలిటీ) ఆధారంగా 2,842 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని వాదించింది. ఈ సగటు ప్రవాహాల నుంచి అన్ని రాష్ట్రాల నీటి వినియోగాన్ని (2,842– 2,191) తీసేస్తే 651 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని వాదించింది. ఆ జలాలనే తరలిస్తామని పేర్కొంది. వాస్తవానికి లోయర్​ గోదావరిలో నీళ్లే లేవని సీడబ్ల్యూసీ, ఎన్‌‌డబ్ల్యూడీఏ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, 231 టీఎంసీల లభ్యత ఉన్నట్టు ఏపీ వాదించింది.  

వాడుకునే హక్కు ఉందంటూ వాదన.. 

ఎగువ రాష్ట్రాలకు కేటాయించని మిగులు వరద జలాలను దిగువ రాష్ట్రంగా వాడుకునే హక్కు తమకు ఉందని ఏపీ అడ్డంగా వాదించింది. బేసిన్​స్టేట్స్​ వాడుకున్నాక కిందకు వచ్చే జలాలనే వాడుకుంటున్నామంటూ పేర్కొంది. 15 ఏండ్లలో జూన్​నుంచి అక్టోబర్ ​వరకు ఉన్న వరదలపై సిమ్యులేషన్​స్టడీస్​ చేశాకే రోజూ 2 టీఎంసీలను తరలించేలా పీబీ లింక్‌‌ను చేపట్టినట్టు వాదించింది.

16 ప్రాజెక్టులకు నీళ్లిస్తరట..

పీబీ లింక్​ ద్వారా దాన్ని చేపట్టే మార్గంలో 16 ప్రాజెక్టులకు నీళ్లిస్తామని సీడబ్ల్యూసీకి ఇచ్చిన వివరణలో ఏపీ పేర్కొంది. అందులో 10 ప్రాజెక్టులను స్థిరీకరించడంతో పాటు ఆరు కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తామని తెలిపింది. తద్వారా గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు నీటి అవసరాలను తీరుస్తామని వెల్లడించింది. డీపీఆర్‌‌‌‌ను తయారు చేసే సమయంలో దీనిపై పూర్తి స్థాయిలో సిమ్యులేషన్​స్టడీస్​చేస్తామని చెప్పింది. 

సిమ్యులేషన్​ స్టడీస్‌‌లో భాగంగా గోదావరి బేసిన్​నుంచి పోలవరానికి గత కొన్నేండ్లుగా వస్తున్న వరద, గోదావరి ట్రిబ్యునల్​అవార్డు ప్రకారం అన్ని పరీవాహక రాష్ట్రాల కేటాయింపులు, అప్​స్ట్రీమ్​, డౌన్​స్ట్రీమ్‌‌లలో నీటి వినియోగం, బొల్లాపల్లి రిజర్వాయర్​నుంచి ఏటా క్యారీ ఓవర్​అయ్యే జలాలు, ఆయకట్టుకు నీళ్లందించేలా బొల్లాపల్లి రిజర్వాయర్​సామర్థ్యం పెంపు వంటి అంశాలపై సిమ్యులేషన్​స్టడీస్​ చేస్తామని పేర్కొంది. పీఎఫ్ఆర్‌‌‌‌లో పేర్కొన్నట్టుగా పోలవరం నుంచి 200 టీఎంసీల జలాలను తరలించేందుకు అవకాశం ఉందని వాదించింది.