ఏపీ:కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు శుభవార్త

ఏపీ:కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు శుభవార్త
  • ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి నవంబర్ నెలాఖరులోగా ఉద్యోగం

అమరావతి: కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తిని కోల్పోయిన బాధలో ఉన్న ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైద్య ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు చూసే ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీల నిర్మాణం, గ్రామాల్లో అర్బన్ హెల్త్ ఏర్పాటు, ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది నియామకం, కోవిడ్ వాక్సినేషన్ తదితర అంశాలపై చర్చించారు. కోవిడ్ పరిస్థితిపై జరిగిన చర్చలో కరోనాతో ఉద్యోగులు చనిపోయిన అంశం చర్చకు వచ్చింది. ఉద్యోగుల పట్ల సానుభూతిగా వ్యవహరించాలని సూచిస్తూ  కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించారు. అది కూడా వచ్చే నవంబర్ నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.