
- పాల్వంచలో అచేతనంగా కనిపించిన ఏపీ బాలిక
పాల్వంచ, వెలుగు: ఏపీకి చెందిన ఆదివాసీ యువతి(17) భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాధపురం పెద్దమ్మ తల్లి ఆలయ సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించడం కలకలం రేపింది. ఆమెపై లైంగికదాడి జరిగిందనే అనుమానాల నేపథ్యంలో ఆమెను స్ర్తీ శక్తి సదన్‌కు ఆమెను తరలించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కుంట సమీపంలో ఉండే తమ పిన్ని ఇంటికి వెళ్లింది. గత శుక్రవారం మధ్యాహ్నం తిరిగి కుంట చేరుకొని, అక్కడి నుంచి తమ గ్రామానికి వెళ్లే బస్సు వెళ్లిపోవడంతో మధ్యాహ్నం ఓ ఆటో ట్రాలీ ఎక్కింది. ఆ తరువాత ఆమె జగన్నాధపురంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద అచేతన స్థితిలో కనిపించింది.
స్థానికులు గుర్తించి ఆమెకు స్పృహ వచ్చాక వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా, ఏమి చెప్పలేకపోవడంతో కొత్తగూడెం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి సమాచారం ఇచ్చారు. షీ టీం ఎస్సై రమాదేవి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. సీడీపీవో లక్ష్మీప్రసన్న వివరాలు సేకరించారు. తాను ఐదో తరగతి వరకు చదివానని, తమ గ్రామానికి తీసుకెళ్తామని చెప్పడంతో శుక్రవారం ట్రాలీ ఆటో ఎక్కానని ఆమె తెలిపింది. చట్టి, ఏడుగురాళ్లపల్లి మధ్యలో ఆటో ట్రాలీలోని ఇద్దరు వ్యక్తులు మద్యం తాగారని, తనకు కూడా బలవంతంగా మద్యం తాగించారని తర్వాత ఏం జరిగిందో తెలియదని వివరించింది.
ఈ విషయమైన పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యా దు చేసినట్లు సీడీపీవో తెలిపారు. బాలికపై లైంగికదాడి జరిగిందా? లేదా? అనే విషయం మెడికల్ రిపోర్టు వచ్చాక తేలుతుందని ఆమె తెలిపారు. కాగా మైనర్ ఒంటిపై గాయాలు ఉండడంతో లైంగికదాడికి గురైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.