చెన్నైకి డ్రింకింగ్‌‌ వాటర్‌‌ పేరుతో ఎత్తిపోతలకు ఏపీ ప్రపోజల్‌‌

చెన్నైకి డ్రింకింగ్‌‌ వాటర్‌‌ పేరుతో ఎత్తిపోతలకు ఏపీ ప్రపోజల్‌‌
  • ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి ఇష్టారాజ్యంగా నీటి తరలింపు
  • మళ్లీ అదే పేరుతో ఇంకో లిఫ్ట్‌‌కు ప్లాన్‌‌
  • తమిళనాడు ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌తో చర్చలు
  • వచ్చే ఏడాదిలో పనులు పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం నీళ్ల దోపిడీకి ఏపీ సర్కారు ఇంకో స్కెచ్‌‌ వేస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ విస్తరణ, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీం పేరుతో వరద నీరు మొత్తాన్ని రాయలసీమకు మళ్లించే ప్రయత్నాల్లో ఉన్న పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు చెన్నైకి తాగునీటి పేరుతో ఎండీడీఎల్‌‌కు దిగువ నుంచి నీళ్లు ఎత్తిపోసేందుకు పాచికలు వేస్తోంది. 40 రోజుల్లో కనీసం 15 టీఎంసీలు తరలించేలా కొత్త లిఫ్ట్‌‌ స్కీంకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ సొమ్ము తన ఖాతా నుంచి కాకుండా తమిళనాడు సర్కారుతో ఖర్చు పెట్టించి లాభం పొందాలని చూస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు గండి పెట్టిందే మద్రాస్‌‌ (చెన్నై)కు తాగునీటి కోసమన్న నిజాన్ని దాచిపెట్టి నీళ్ల దోపిడీ ఎత్తుగడలకు మరింత పదును పెడుతోంది. చెన్నైకి తాగునీళ్లు ఇవ్వాలంటే ఈ లిఫ్టు తప్పనిసరి అనేలా వాదనలు వినిపిస్తోంది.

శ్రీశైలానికి గతంలోనే గండి

తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై తాగునీటి కోసమంటూ శ్రీశైలం రిజర్వాయర్‌‌కు బొక్కపెట్టి అప్పట్లో తెలుగుగంగ ప్రాజెక్టుకు తెరతీశారు. 1976లో మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఏపీ మధ్య ఈ మేరకు అగ్రిమెంట్‌‌ కుదిరింది. 
ఒక్కో రాష్ట్రం 5 టీఎంసీల చొప్పున 15 టీఎంసీలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1,500 క్యూసెక్కుల చొప్పున నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. 1978లో మొదలైన ఈ పనులు ఎన్టీఆర్‌‌ సీఎం అయిన తర్వాత వేగవంతమయ్యాయి. తెలుగుగంగ పేరుతో చెన్నై తాగునీటితోపాటు ఎస్‌‌ఆర్బీసీ పేరు చెప్పి రాయలసీమకు సాగునీళ్లు ఇవ్వడాన్ని ప్రారంభించారు. తెలుగుగంగకు 15, ఎస్‌‌ఆర్బీసీకి 19 టీఎంసీలు మాత్రమే కేటాయింపులు ఉండగా.. అంతకు మూడు నాలుగు రెట్లు నీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ ద్వారా తరలిస్తున్నారు. గడిచిన 15 ఏళ్ల లెక్కలు చూస్తే వర్షపాతం తక్కువగా ఉన్న సీజన్‌‌లో రెండేళ్లు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి కేటాయింపుల కన్నా తక్కువ నీటిని తీసుకున్నారు.

వైఎస్ హయాంలో కెపాసిటీ భారీగా పెంపు

వైఎస్‌‌ రాజశేఖర్‌‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 11 వేల క్యూసెక్కులు ఉన్న పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌‌ కెపాసిటీని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రోజుకు టీఎంసీ వరకు నీటిని తరలిస్తున్నారు. వచ్చే ఫ్లడ్‌‌ ఇయర్‌‌ నాటికి వెలిగొండ టన్నెల్‌‌ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. శ్రీశైలంలో 797 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసేలా సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. పోతిరెడ్డిపాడు పాత, కొత్త రెగ్యులేటర్‌‌ల ద్వారా రోజుకు 5 టీఎంసీలకు పైగా నీళ్లు గ్రావిటీతో తరలించుకోవచ్చు. వెలిగొండ టన్నెల్‌‌ ద్వారా రోజుకు ఒక టీఎంసీ, ఎస్కేప్‌‌ గేట్ల ద్వారా అర టీఎంసీ తరలించే అవకాశముంది. హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌, ముచ్చుమర్రి ఎత్తిపోతలు ఇప్పటికే నిర్వహణలో ఉన్నాయి. పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏడాదిన్నర క్రితమే అనుమతులు ఇచ్చారు. ఇవి చాలవన్నట్టు ఏపీ చెన్నై తాగునీటికి రోజుకు 3,500 నుంచి 4 వేల క్యూసెక్కుల చొప్పున 30 నుంచి 40 రోజుల్లో 15 టీఎంసీలను తరలించేలా ఎత్తిపోతలకు ఏపీ రూపకల్పన చేసింది. శ్రీశైలంలో డ్రా లెవల్‌‌గా ఉన్న 834 అడుగులకు దిగువన ఈ లిఫ్ట్‌‌ ప్రతిపాదించింది.

ఖర్చు తమిళనాడుకు.. నీళ్లు ఏపీకి!

శ్రీశైలం రిజర్వాయర్‌‌కు వచ్చే వరద నీటిని రాయలసీమ అవసరాల కోసమే నిల్వ చేసుకుంటామని.. సోమశిల, కండలేరు నుంచి ఇకపై నీళ్లు ఇవ్వలేమని ఏపీ అడ్డగోలు వాదన మొదలు పెట్టింది. శ్రీశైలం రిజర్వాయర్‌‌పై కొత్త ఎత్తిపోతలు చేపట్టి పైపులైన్‌‌ ద్వారా నీటిని తరలించుకుపోవాలని తమిళనాడుకు సూచిస్తోంది. కానీ వైల్డ్‌‌ లైఫ్‌‌ శాంక్చురీలు, రిజర్వ్‌‌ ఫారెస్ట్‌‌ దాటుకొని కొత్తగా పైపులైన్‌‌ వేయడం దాదాపు అసాధ్యం. దీని పైపులైన్‌‌ కోసం భూసేకరణ కూడా భారీ ఖర్చుతో కూడుకున్నది. దీంతో పైపులైన్‌‌ సాధ్యం కాదు కాబట్టి పంపుహౌస్‌‌ కట్టి తెలుగుగంగ కాల్వ ద్వారా నీటిని తరలించాలనేది ఏపీ నిర్ణయం వెనుక అంతరార్థంగా తెలుస్తోంది. ఈ ఎత్తిపోతల పథకాన్ని వచ్చే ఏడాది నాటికి పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎస్టిమేట్స్‌‌ కూడా సిద్ధం చేసింది. ఇదే విషయంపై తమిళనాడు ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌తో చర్చలు జరుపుతోంది. ఈ ఎత్తిపోతల పథకం అంశాన్ని ఇటీవల నిర్వహించిన కేఆర్‌‌ఎంబీ చెన్నై వాటర్‌‌ సప్లయ్‌‌ కమిటీ మీటింగ్‌‌లో లేవనెత్తి మినిట్స్‌‌లో చేర్చింది. తెలంగాణ దీనిపై అబ్జెక్షన్ చెప్పినా ఎత్తిపోతల పథకాన్ని పట్టాలెక్కించేందుకు లాబీయింగ్‌‌ మొదలు పెట్టింది. ఈ లిఫ్టుకు తమిళనాడుతో ఖర్చు పెట్టించి, శ్రీశైలంలో తక్కువ నీటి మట్టం ఉన్నప్పుడు తమ రాష్ట్రానికి నీళ్లు తీసుకునేలా 
ఎత్తుగడలు వేస్తోంది.