రైతు ఖాతాల్లోకే నేరుగా సాగు యంత్రాల సబ్సిడీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతు ఖాతాల్లోకే నేరుగా సాగు యంత్రాల సబ్సిడీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు : వ్యవసాయ యాంత్రీకరణలో పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ పనిముట్లపై ఇచ్చే సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్‌లో వానకాలం సీజన్-2026 ముందస్తు ఏర్పాట్లపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం యంత్రాల కొనుగోలుపై ఇచ్చే 40 శాతం సబ్సిడీని కంపెనీలకు అందజేస్తున్నారని తెలిపారు. ఇకపై ఈ విధానాన్ని మార్చి, నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు బదిలీ చేసేలా విధివిధానాలు రూపొందించాలని మంత్రి సూచించారు. విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలుత కొండారెడ్డిపల్లి, జనంపేటలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, అనంతరం మొదటి దశలో 1600 రైతు వేదికలకు విస్తరించాలని రెడ్కో సంస్థను ఆదేశించారు.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకూలంగా ఉండటంతో సాగు విస్తీర్ణం 60.60 లక్షల హెక్టార్లకు చేరుతుందని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా 11.50 లక్షల టన్నుల యూరియాను కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు. వానకాలం సీజన్‌కు అవసరమైన ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలను ఏప్రిల్ నెలాఖరుకల్లా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.