ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌లో క్లాత్ వాష్ సర్వీసులు

ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌లో క్లాత్ వాష్ సర్వీసులు
  • వర్క్​ బిజీతో వీటిని ఆశ్రయిస్తున్న సిటిజన్లు
  • అందుబాటులో ఫ్రీ పికప్, డెలివరీ
  • కిలో బట్టలకు రూ.79 నుంచి చార్జీ మొదలు


హైదరాబాద్, వెలుగు: జాబర్స్​కి టైమ్ అంతా ఆఫీస్ వర్క్ తోనే సరిపోతుంది. ఇంటి పనులు చేసుకోడానికి సమయమే ఉండదు. భార్యాభర్తలిద్దరూ జాబ్ చేస్తుంటే ఇక అంతే సంగతులు. లాండ్రీ బాస్కెట్‌‌‌‌‌‌‌‌లో ఉతికేందుకు ఉంచిన బట్టల సంగతి యాదికే ఉండదు. వాటిని ఉతికి, ఇస్త్రీ చేసుకోవడం సవాలే. జాబ్స్​చేసే బ్యాచిలర్స్​పరిస్థితి కూడా ఇంతే. ఇలాంటి వారి కోసమే వాష్ సర్వీసులు కూడా ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులోకి వచ్చేశాయి. వెబ్​సైట్ తోపాటు, యాప్​లలో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటుండటంతో సిటీలో వీటికి క్రమంగా డిమాండ్ పెరుగుతోంది.

వర్క్ ప్రెజర్.. దొరకని లీజర్

ప్రొఫెషనల్ గా కనిపించాలంటే వేసుకునే బట్టలు అంతే నీట్ గా ఉండాలి. అయితే పని ఒత్తిడిలో జాబర్స్ వాషింగ్‌‌‌‌‌‌‌‌ పై దృష్టిపెట్టలేకపోతున్నారు. వర్క్​ఫ్రమ్ ఆఫీస్​మొదలయ్యాక ఫ్యామిలీస్​తోపాటు బ్యాచిలర్స్ సిటీకి వచ్చేశారు. అటు ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పనులు, ఇంటికి వచ్చాక అబ్రాడ్ క్లయింట్ కాల్స్ తో గడిపేస్తున్నారు. దీంతో బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకునేందుకు వారికి టైం కూడా ఉండటం లేదు. వారమంతా వర్క్‌‌‌‌‌‌‌‌ వల్ల ఒత్తిడికి గురవుతుండటంతో వీకెండ్‌‌‌‌‌‌‌‌లో ఖాళీ సమయం దొరికినా బట్టలు ఉతుక్కోవడానికి కేటాయించలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ఇంటికే వచ్చి బట్టలను తీసుకెళ్లి, క్లీన్​గా ఉతికి మళ్లీ తీసుకొచ్చి ఇచ్చే లాండ్రీ సర్వీసులను పలు సంస్థలు అందిస్తున్నాయి. కొన్నేళ్లుగా సిటీలో వాష్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నప్పటికీ.. లాక్ డౌన్ లో ఢీలా పడిన ఈ కంపెనీలు ఇప్పుడు మళ్లీ ఫుల్ డిమాండ్‌‌‌‌‌‌‌‌తో నడుస్తున్నాయి.

 ఇంటి వద్దకే సర్వీస్ 

సిటీలోని చాలా ఏరియాల్లో, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కంపెనీల బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లు ఏర్పడుతున్నాయి. బిజీ బీస్, క్విక్ లో, వాష్ మార్ట్, వాష్ యాప్, టెక్ వాష్, తంబుల్ డ్రై, వన్ అవర్ లాండ్రీ, మ్యాజిక్ క్లీన్ వంటి పేర్లతో ప్రొఫెషనల్ లాండ్రీ సర్వీస్ సెంటర్లు సిటీలో పుట్టుకొచ్చాయి. యాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా గానీ, వెబ్​సైట్ లో గానీ సంప్రదిస్తే సదరు కంపెనీకి చెందిన సిబ్బంది ఇంటికే వచ్చి బట్టలను తీసుకెళ్లి ఉతికి, ఇస్త్రీ చేసి తిరిగి డోర్ డెలివరీ చేసి వెళ్తున్నారు. కిలో బట్టలకు రూ.79 కంపెనీలు చార్జీలు మొదలవుతున్నాయి. 48 గంటల్లో కస్టమర్ కి ఫ్రీగా డోర్ డెలివరీ చేస్తున్నాయి. ఈ సర్వీసులు ఈజీగా ఉండటం, టైం సేవ్ అవుతుండటంతో చాలామంది వీటిని ఆశ్రయిస్తున్నారు.

ఉతుక్కోవడం కష్టంగా మారింది

వర్క్​ఫ్రమ్​హోం ముగించుకొని 2 నెలల క్రితం సిటీకి షిఫ్ట్ అయ్యాను. ఫ్రెండ్స్ తో పాటు రూమ్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నా. ఆఫీసుకి వెళ్లి రావడం, వండుకుని తినడం.. వీటితోనే రోజంతా గడిచిపోతోంది. బట్టలు ఉతుక్కోవడం కష్టమవుతోంది. అందుకే ఈ సర్వీసెస్ గురించి ఆన్ లైన్ లో సెర్చ్ చేశాను. రీసెంట్ గా ఒక యాప్ చూశా. వారి సర్వీసు నచ్చి బట్టలను ఉతికేందుకు వారికే ఇస్తున్నా.
– ఆంజనేయులు, ఐటీ ఎంప్లాయ్, కొండాపూర్‌‌‌‌‌‌‌‌


కాంపిటీషన్ పెరిగింది

నేను ఢిల్లీకి చెందిన కంపెనీ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నా. మా దగ్గర లాండ్రీ, డ్రై క్లీనింగ్ సర్వీసెస్ ఉన్నాయి. క్లాత్స్ వాషింగ్ కి కిలోకి రూ.80 చార్జి చేస్తున్నాం. ఈ మధ్య సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్న వాళ్లు పెరిగారు. గతంతో పోలిస్తే లాండ్రీ సర్వీసుల మధ్య కాంపిటీషన్ పెరిగింది. మేము కస్టమర్ అవసరాన్ని బట్టి గంటలో కూడా డెలివరీ చేస్తున్నాం. వీకెండ్ లో బుకింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. 
- రమేశ్ గుజ్జారి, ఫ్రాంచైజీ ఓనర్, వాష్ మార్ట్, మణికొండ