బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లు 

 బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లు 
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్: ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నెక్లెస్ రోడ్ లోని కర్బలా మైదానం ఘాట్ వద్ద బతుకమ్మ ఏర్పాట్లను మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 13వ తేదీన సద్దుల బతుకమ్మ సందర్భంగా అంబేడ్కర్ నగర్, కర్బలా మైదానం, పీవీ ఘాట్ లలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తారని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా నెక్లెస్ రోడ్డుపై వాహనాల దారి మళ్లించాలని ట్రాఫిక్.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలిచ్చారు. అదేవిధంగా  విద్యుత్ లైట్ల ను ఏర్పాటు చేయాలని, బతుకమ్మ వేడుకల వద్దకు వచ్చే వారికి పంపిణీ చేసేందుకు వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నేడు దేశ విదేశాలలో ఎంతో గొప్పగా నిర్వహిస్తుండటంతో విశ్వవ్యాప్తం అయిందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు.