మోదీ సభలో బలమైన సందేశం పంపిన ఖాళీ కుర్చీ

మోదీ సభలో బలమైన సందేశం పంపిన ఖాళీ కుర్చీ

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. ఓ ఖాళీ కుర్చీ అందర్నీ ఆకర్షించింది. ఇంతకీ ఆ సీటు కేటాయింపు ఎవరిదన్న విషయానికొస్తే.. ఆ కుర్చీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అలాట్ చేయబడి ఉంది. అంటే ఆయనఈ వేడుకలకు దూరంగా ఉన్నారని వెల్లడవుతోంది. దీంతో అతిథుల కోసం కేటాయించిన కుర్చీల్లో ఆయన పేరుతో ఉన్న ఓ కుర్చీ ఇలా ఖాళీగా కనిపించింది. ఈ క్రమంలోనే ఖర్గే ఆరోగ్యం బాలేదని, అందుకే ఆయన వేడుకల్లో పాల్గొనలేదని కాంగ్రెస్ వెల్లడించింది.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖర్గే.. సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని పోస్టు టేశారు. ఇందులో గత ప్రధానమంత్రుల కృషిని ఎత్తిచూపుతూ బలమైన సందేశాన్ని పంపారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, బిఆర్ అంబేద్కర్ వంటి స్వాతంత్ర్య దిగ్గజాలకు ఖర్గే తన వీడియో సందేశంలో నివాళులర్పించారు.

దాంతో పాటు భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి ఇతర కాంగ్రెస్ ప్రధానుల సహకారాన్ని కూడా ఖర్గే హైలైట్ చేశారు. బీజేపీ దిగ్గజం అటల్ బిహారీ వాజ్‌పేయిని కూడా ఆయన ప్రస్తావించారు. "ప్రతి ప్రధాని దేశ ప్రగతికి దోహదపడ్డారు. భారతదేశం గత కొన్నేళ్ల నుంచి మాత్రమే పురోగతిని చూస్తోందని కొందరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతి ప్రధాని దేశాభివృద్ధికి ఎంతో సహకరించారు" అని కాంగ్రెస్ అధ్యక్షుడు పీఎం మోదీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

"అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు, ప్రధానమంత్రులందరూ దేశం గురించి ఆలోచించారు, అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు తీవ్రమైన ముప్పులో ఉన్నాయని నేను బాధతో చెబుతున్నాను. విపక్షాల గొంతును అణిచివేసేందుకు కొత్త సాధనాలు ఉపయోగిస్తున్నారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులే కాదు, ఎన్నికల కమిషన్‌ను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రతిపక్ష ఎంపీలను కూడా సస్పెండ్ చేస్తున్నారు, మైక్‌లు మ్యూట్ చేస్తున్నారు, ప్రసంగాలు తొలగిస్తున్నారు అని కేంద్రంపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“మహా నాయకులు కొత్త చరిత్ర సృష్టించడానికి గత చరిత్రను చెరిపివేయరు. వారు ప్రతిదానికీ పేరు మార్చడానికి ప్రయత్నిస్తారు. వారు గత పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరు మార్చారు, తమ నియంతృత్వ మార్గాలతో ప్రజాస్వామ్యాన్ని చీల్చుతున్నారు. ఇప్పుడు వారు దేశంలో శాంతిని నెలకొల్పిన పాత చట్టాల పేర్లను కూడా మారుస్తున్నారు. మొదట 'అచ్ఛే దిన్' అన్నారు, తర్వాత కొత్త భారతదేశం, ఇప్పుడు అమృత్ కాల్ - తమ వైఫల్యాలను దాచుకోవడానికే కదా ఇలా పేర్లు మార్చుకుంటున్నారు? అని ఆయన మండిపడ్డారు.