భద్రాద్రి జిల్లాలో పోడురైతుల ఆందోళన 

భద్రాద్రి జిల్లాలో పోడురైతుల ఆందోళన 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పోడు భూముల సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గిరిజన, ఆదివాసీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామంలోని పోడు రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. 

పోడు భూముల సర్వేలో అవకతవకలు జరిగాయని గిరిజన, ఆదివాసీ రైతులు ఆరోపించారు. 2001 నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్నామని.. సర్వే చేపట్టిన అధికారులు పారదర్శకత పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గిరిజన రైతులు ఆరోపించారు. సాగు చేసుకుంటున్న భూముల్లో కంచె వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్వో, కలెక్టర్ దగ్గరకు వెళ్లినా తమకు న్యాయం జరిగేటట్లు కనిపించడం లేదన్నారు. తమ భూములను సర్వే చేసి ఇచ్చే వరకూ ఆందోళన విరమించమని స్పష్టం చేశారు. పోడు భూముల సర్వే తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు.