మీ దగ్గర వాసనొస్తుంది.. లోపలికి రావద్దు.. మున్సిపల్‌‌ ఆఫీస్‌‌లోకి రాకుండా శానిటేషన్‌‌ వర్కర్లను అడ్డుకున్న ఉద్యోగి

మీ దగ్గర వాసనొస్తుంది.. లోపలికి రావద్దు.. మున్సిపల్‌‌ ఆఫీస్‌‌లోకి రాకుండా శానిటేషన్‌‌ వర్కర్లను అడ్డుకున్న ఉద్యోగి
  • మున్సిపల్‌‌ ఆఫీస్‌‌లోకి రాకుండా శానిటేషన్‌‌ వర్కర్లను అడ్డుకున్న ఉద్యోగి
  • ఆందోళనకు దిగిన కార్మికులు
  • అచ్చంపేట మున్సిపాలిటీ వద్ద ఘటన

అచ్చంపేట, వెలుగు : ‘మీ దగ్గర వాసన వస్తుంది.. మీరు ఆఫీస్‌‌లోకి రాకండి’ అని మున్సిపల్‌‌ శానిటేషన్‌‌ వర్కర్లను ఓ అధికారి అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన కార్మికులు ఆఫీస్‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అచ్చంపేట మున్సిపల్‌‌ ఆఫీస్‌‌లో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించిన అనంతరం స్వీట్లు తీసుకునేందుకు శానిటేషన్‌‌ వర్కర్లు ఆఫీస్‌‌లోకి వెళ్లారు. 

వీరిని గమనించిన మున్సిపల్‌‌ వార్డు ఇన్‌‌చార్జి గణేశ్‌‌ ‘మీ దగ్గర వాసన వస్తుంది, లోపల వీఐపీలు ఉన్నారు, మీరు ఆఫీస్‌‌లోకి వచ్చేందుకు వీలు లేదు’ అంటూ వారిని అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన కార్మికులు మున్సిపల్‌‌ ఆఫీస్‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. తాము 30 ఏండ్లుగా ఇక్కడే పనిచేస్తున్నామని గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, మున్సిపల్‌‌ కమిషనర్‌‌గా మురళి వచ్చిన తర్వాతే ఆఫీసర్ల వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. 

కార్మికులను అవమానించిన వార్డు ఇన్‌‌చార్జి గణేశ్‌‌, కమిషనర్‌‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు. విషయం తెలుసుకుని పోలీసులు మున్సిపల్‌‌ ఆఫీస్‌‌కు చేరుకొని కార్మికులతో మాట్లాడారు. కార్మికులు ఫిర్యాదు చేస్తే ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం కార్మికులు కమిషనర్‌‌తో చర్చించగా.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.