ఫేక్ సర్టిఫికెట్లతో పాతబస్తీలో ఉగ్రవాదులు పాగా: బండి సంజయ్

ఫేక్ సర్టిఫికెట్లతో పాతబస్తీలో ఉగ్రవాదులు పాగా: బండి సంజయ్

హైదరాబాద్ లో ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు.  బర్త్ సర్టిఫికెట్ల జారీ వైఫల్యానికి కేసీఆర్ బాధ్యత వహించి కేసీఆర్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.  దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్రలో భాగంగానే ఫేక్ బర్త్ సర్టిఫికెట్లతో పాస్  పోర్ట్ పొంది ఉగ్రవాదులు పాతబస్తీలో పాగా వేస్తున్నారని ఆరోపించారు.  పాతబస్తీ ఐఎస్ఐ అడ్డాగా మారిందన్నారు.  దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా దాని మూలాలు పాతబస్తీలో బయటపడటమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. ఓట్లు, సీట్ల కోసం కేసీఆర్ పాతబస్తీని ఎంఐఎంకు ధారాదత్తం చేశారని విమర్శించారు. అల్లర్లు సృష్టించి  కేంద్రాన్ని బద్నాం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన  అవినీతికి ఫేక్ సర్టిఫికెట్ల స్కాం నిదర్శనమని బండి సంజయ్ ఆరోపించారు. దీనికంతటికి మొదటి ముద్దాయి సీఎం కేసీఆరేనని..దీనికి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై  ర్ ప్రభుత్వం  తూతూ మంత్రంగా విచారణ జరిపి కింది స్థాయి సిబ్బంది, అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలనుకుంటోందని ఆరోపించారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా చర్చను పక్కదారి పట్టించేందుకు ప్లాన్ చేస్తోందన్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నామని చెప్పారు.