కేంద్రం బియ్యం ఇస్తున్నా.. పేదలకు పంచరా?

కేంద్రం బియ్యం ఇస్తున్నా..  పేదలకు పంచరా?
  • రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో కేసీఆర్ ఫెయిల్: సంజయ్
  • కేంద్రం చెల్లిస్తున్న కమీషన్​ను రాష్ట్ర సర్కార్ వాడుకుంటోందని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఉచితం గా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నా వాటిని పేదలకు అందించకుండా సీఎం కేసీఆర్ సర్కార్ పేదల పొట్టకొడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర సర్కార్ తీరుతో రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయిందన్నారు. డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిలైందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏండ్ల తరబడి రేషన్​ డీలర్ల సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గు చేటని, డీలర్లను పిలిచి మాట్లాడే తీరిక సీఎంకు లేకపోవడం బాధాకరమన్నారు. మే 22న సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ల సమస్యలన్నీ పరిష్కారిస్తామని, జూన్ ఫస్ట్ న  జీవోలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ ఒక్క జీవో కూడా రాలేదన్నారు. డీలర్లు కరోనా టైంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేశారన్నారు. ఏ ఒక్కరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో ప్రధాని మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ కేటాయించిందన్నారు. 

రైతుల ఉసురు తీస్తున్న సర్కార్  

రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్‌లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోందని సంజయ్ తెలిపారు. 3 నెలలకోసారి కేంద్రం కమీషన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోందని, అయినా ఆ సొమ్ము డీలర్లకు ఇవ్వకుండా సర్కార్ సొంత అవసరాలకు వాడుకోవడం దుర్మార్గమన్నారు. వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తూ రైతులతో చెలగాటం ఆడుతోంద న్నారు. వడ్ల కొనుగోలుకయ్యే సొమ్మును కేంద్రమే చెల్లిస్తోందని, వడ్లను సేకరించినందుకు కమీషన్ కూడా ఇస్తోందన్నారు. అయినా నేటికీ వడ్లను కొనుగోలు చేయకుండా కల్లాల వద్దే రైతులు పడిగాపులు కాసేలా చేస్తూ రాష్ట్ర సర్కార్ వాళ్ల ఉసురు తీస్తోందన్నారు.