
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్సనల్ చెఫ్ టఫారి కాంప్‌బెల్ చనిపోయాడు. మార్తాస్ వైన్యార్డ్‌లోని ఒబామా ఇంటికి సమీపంలో పడవ ప్రమాదంలో మునిగిపోయి అతను చనిపోయినట్టు తెలుస్తోంది.
వెకేషన్ ఐలాండ్ లో... అంటే ఒబామా ఇంటికి సమీపంలో ఉన్న ఎడ్గార్‌టౌన్ గ్రేట్ పాండ్ నుంచి 45 ఏళ్ల టఫారి కాంప్‌బెల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మసాచుసెట్స్ స్టేట్ పోలీసులు తెలిపారు. అతను నీటిలోకి వెళ్లి తిరిగి రాలేదని తోటి పాడిల్ బోర్డర్ చెప్పడంతో.. ఎమర్జెన్సీ సిబ్బంది అతన్ని వెతికే ప్రయత్నం చేశారు. చివరికి సోనార్ ఉపయోగించి ఆయన డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఒబామా, ఆయన భార్య మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ఇంట్లో లేరు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్యాంప్‌బెల్ వైట్ హౌస్‌లో సౌస్ చెఫ్‌గా పనిచేశాడు. "అతను మా జీవితంలో భాగమయ్యాడు. అతను చనిపోయాడమే వార్త మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది" అని ఒబామా ఒక ప్రకటనలో తెలిపారు. "ఈ రోజు తఫారీని కోల్పోయినందుకు ముఖ్యంగా అతని భార్య షెరిస్, వారి కవల పిల్లలు జేవియర్, సావిన్ లకు సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ఆయన చెప్పుకొచ్చారు.
ఒబామా కుటుంబం 2021లో బోస్టన్ సెల్టిక్స్ యజమాని విక్లిఫ్ గ్రౌస్‌బెక్ నుంచి మార్తాస్ వైన్యార్డ్‌లో ఉన్న దాదాపు 7వేల చదరపు అడుగుల భవనాన్ని కొనుగోలు చేసింది. ఈ ఇల్లు అట్లాంటిక్ మహాసముద్రం బీచ్ ద్వారా వేరు చేయబడిన తీరప్రాంత చెరువును ఆనుకుని ఉంది.