
- రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాలు, వివిధ పార్టీల వినతి
- పీఎం అపాయింట్‌మెంట్ బాధ్యతను ఎంపీలు లక్ష్మణ్, ఆర్. కృష్ణయ్య తీసుకోవాలి
- రిజర్వేషన్లు అమలయ్యేదాకా పోరాటం నిరంతరం కొనసాగించాలి
- రిజర్వేషన్ల పెంపు తర్వాతే లోకల్ బాడీ
- ఎలక్షన్స్ నిర్వహించాలని డిమాండ్
- బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు స్టే, పరిష్కార మార్గాలు, భవిష్యత్ కార్యాచరణపై
- బీసీ సంఘాల సమావేశం
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తూ ఉండాలని బీసీ సంఘాలు, పలు పార్టీల నేతలు పిలుపునిచ్చారు. లీగల్‌గా, రాజకీయంగా రెండు మార్గాల్లో పోరాటం చేయాలని సూచించారు. వెంటనే అన్ని రాజకీయ పార్టీల నేతలు, బీసీ సంఘాల నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు అందరినీ తీసుకెళ్లాలని రాష్ట్ర సర్కారును కోరారు.
ప్రధాని అపాయింట్‌మెంట్ బాధ్యతను ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ కె.లక్ష్మణ్, ఎంపీ ఆర్. కృష్ణయ్య తీసుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్ల రక్షణ బాధ్యతను బీజేపీ నేతలు తీసుకోవాలన్నారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కళింగ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ‘బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు స్టే, పరిష్కార మార్గాలు, భవిష్యత్ కార్యాచరణ’పై బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు.
ఈ మీటింగ్‌లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, ఇందిరా శోభన్, సీపీఐ నుంచి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బీజేపీ నుంచి ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఆనంద్‌గౌడ్, టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం, బీసీ నేత వీఆర్ నారగోని, సీపీఎం నుంచి రవికుమార్, సీపీఐ ఎంఎల్ నుంచి గోవర్ధన్‌తోపాటు 30 బీసీ కుల సంఘాలు, 80 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, యూనివర్సిటీల ప్రొఫెసర్లతోపాటు పెద్ద ఎత్తున బీసీ నేతలు పాల్గొన్నారు.
రెండు విధాలా పోరాడాలి: ప్రొఫెసర్ కోదండరాం
రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని రాజ్యాంగంలో లేదని, కోర్టులు సైతం చెప్పలేదని తెలంగాణ జన సమితి (టీజీఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం దాటవచ్చని కోర్టులు చెప్పాయని, కులగణన చేసి పెంచుకోవచ్చని సూచించాయన్నారు. “ లీగల్ పోరాటం చేయాలి. అదే సమయంలో కార్యాచరణ రెడీ చేసి పార్టీ, రాజకీయపరంగా పోరాటాన్ని కొనసాగించాలి. అందరినీ ఐక్యం చేయాలి. అన్ని ప్రజాస్వామ్య శక్తులు కలిసి రావాలి. అన్ని పార్టీలు ముందుకు రావాలి. ఢిల్లీలో కార్యాచరణ ఖరారు చేయాలి. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మిగతా పార్టీలు కూడా ముందుకు రావాలి” అని పేర్కొన్నారు.
రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, కానీ ఇప్పుడు మాత్రం నిలబడవు కదా అంటున్నాయని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆయా పార్టీలకు చిత్తశుద్ధి ఉందా? అనే అనుమానం వస్తున్నదని అన్నారు. బీసీల్లో అన్ని రంగాల్లో అసమానతలు ఉన్నాయని చెప్పారు. బీసీలను అన్ని పార్టీలు, అధికారులు మోసం చేస్తున్నారని బీసీ సంఘం నేత వీఆర్ నారగోని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్లు ఇవ్వండం లేదని, మంత్రి పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో వివక్ష కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
రిజర్వేషన్ల అంశంపై అన్ని సంఘాలతో కలిపి ఒకే జేఏసీ ఏర్పాటు చేయాలని కోరారు. రిజర్వేషన్ల అంశం ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లిందని, అన్ని సంఘాలు ఏకమై ఈ అంశంపై మరింత పోరాటం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఆనంద్‌గౌడ్ పిలుపునిచ్చారు. చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాలు విఫలం అయ్యాయని, కానీ, తమిళనాడులో జయలలిత పట్టుబట్టి 9వ షెడ్యూల్‌లో చేర్పించి సక్సెస్ అయ్యారని గుర్తు చేశారు.
గవర్నర్లతో రాజకీయం చేస్తున్నరు: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మండిపడ్డారు. అన్ని పార్టీలు మద్దతు తెలిపి.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చి ఆమోదించకుండా చేశారన్నారు. రిజర్వేషన్ల పెంపు అంశంలో అన్ని పార్టీలు, బీసీ , ఎస్టీ, ఎస్టీ సంఘాలను కలుపుకొని తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కుల గణన చేసిందని, అసెంబ్లీలో బిల్లు ఆమోదించిందని తెలిపారు.
రిజర్వేషన్లపై కార్యాచరణ ప్రకటించాలి: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
తెలంగాణ ఉద్యమ తొలి మీటింగ్ కేసీఆర్, కోదండరాం, జానారెడ్డి ఆధ్వర్యంలో ఇదే భవన్‌లో జరిగిందని, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీటింగ్ సైతం ఇక్కడే జరుగుతున్నదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎస్సీ, ఎస్టీ, ఓసీ సంఘాలు సైతం అంగీకరించాలని, కోర్టులకు వెళ్లిన వ్యక్తులు చాలా చిన్న వ్యక్తులని పేర్కొన్నారు. ఈ నెల 14న రిజర్వేషన్ల బంద్ అంశంపై ఎంపీ ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్, బీఆర్ఎస్ , సీపీఐ, సీపీఎం నేతలను కలవాలని దయాకర్ కోరారు.
బీసీల్లోని ఎంబీసీలు ఇప్పటికీ ఎంతో వెనకబడి ఉన్నారని, రిజర్వేషన్లు పెరిగితే అందరూ అభివృద్ధి చెందడంతోపాటు బీసీలకు పదవులు వస్తాయని పేర్కొన్నారు. అన్ని సంఘాలు కలసి కార్యాచరణ ప్రకటించాలని కోరారు. బీసీ సంఘాలు ఐక్యంగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. చట్ట సభల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు కావాలన్నారు. రిజర్వేషన్ల పోరాటంపై అల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని, పోరాటానికి రెడీ కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లో కూడా బీసీ నేతలు రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతున్నారని, ఇలాంటి టైమ్ లో బేషజాలకు పోకుండా అందరిని కలుపుకొని ముందుకు పోవాలని సూచించారు.
హైకోర్టు స్టే పై సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేస్తామని, అలాగే.. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఈరవత్రి అనిల్పేర్కొన్నారు. వివిధ పార్టీల నాయకులు, బీసీ సంఘాలు డిమాండ్ చేసినట్టుగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేలా సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ప్రధాని అపాయింట్‌మెంట్ బీజేపీ నేతలు ఇప్పిస్తే అఖిలపక్ష నేతలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలుస్తామని, రిజర్వేషన్లు పెంచాల్సిన ఆవశ్యకతను వివరిస్తామని అన్నారు.
ఈ సమస్యను బీసీ ప్రధాని పరిష్కరించాలి: జాజుల
దేశంలోని చాలా సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని , బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సైతం పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, అన్ని పార్టీల నేతలు ప్రధానిని కలిసి రిజర్వేషన్ల అంశాన్ని వివరించేందుకు అపాయింట్ మెంట్ తీసుకోవాలని, ఇందుకు ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ చొరవ చూపాలన్నారు.
బీసీ సమాజం రోడ్డు మీదకు వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారు. కులాల వారీగా విడిపోతే రాష్ట్రంలో చాలా సమస్యలు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలన్నారు. రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినా రిజర్వేషన్లు అమ లు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.