హైకోర్టులో బలమైన వాదనలు వినిపించాలి..తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య

హైకోర్టులో బలమైన వాదనలు వినిపించాలి..తెలంగాణ బీసీ జేఏసీ  చైర్మన్ ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుందని, ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎత్తరి భీమ్ రాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నుంచి ఓయూలో బీసీల రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్షలు చేపట్టుతున్నట్లు తెలిపారు. 

పార్టీల పరంగా కాకుండా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలన్నారు. బంద్​లో పాల్గొన్న బీసీ సంఘాల నేతలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు. అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్, బీసీ నేతలు లక్ష్మణ్, నరేశ్​గౌడ్, బోయ గోపి, కిశోర్ యాదవ్, నిఖిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

అద్దె వాహనాల బకాయిలు చెల్లించాలి

ముషీరాబాద్ : వాణిజ్య పన్నుల శాఖలో అద్దె వాహనాల బకాయిలు వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌‌.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుంటే అద్దె వాహనాల యాజమాన్యాలు, డ్రైవర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 

సోమవారం విద్యానగర్​లోని బీసీ భవన్​వద్ద ఆయనను అద్దె వాహనాల డ్రైవర్లు కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. 9 నెలలుగా బకాయిలు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. కాంట్రాక్లర్లకు కోట్లాది రూపాయల బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం అద్దె వాహనాలకు బకాయిలు నిలిపివేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.