
- జడ్పీలో పెరిగిన బీసీ రిజర్వేషన్లు.. ఆశావహులు పోటాపోటీ
- అప్పుడే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పల్లెల్లో దసరా పండుగ ముందే వచ్చింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎన్నికల సందడి మొదలైంది. జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి జడ్పీ పీఠంపైనే పడింది. ఒక్కసారిగా జిల్లాలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. మరో వైపు బీసీలకు జడ్పీటీసీ రిజర్వేషన్లు పెరగడంతో బీసీల్లో ఉత్సాహం నెలకొంది. అప్పుడే ఆశావహులు ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు.
మారుతున్న రాజకీయ సమీకరణాలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ చైర్మన్‌తో పాటు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల రిజర్వేషన్ల ఖరారుతో రాజకీయం సమీకరణాలు మారుతున్నాయి. గతంలో జడ్పీ చైర్మన్ ఎస్టీ జనరల్ గా ఉంది. ఎస్టీలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ఎస్టీలకు అయ్యే అవకాశం ఉందనే దానితో పొలిటికల్ లీడర్లు పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఈసారి జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ కావడంతో పొలిటికల్ లీడర్లలో ఆశలు మొదలయ్యాయి.
పార్టీలో తమకు సరైన పదవులు రాని వారంతా జడ్పీ చైర్మన్పీఠాన్ని దక్కించుకునేందుకు తమ అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఆయా పార్టీల ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. జడ్పీటీసీ టికెట్ కోసం పార్టీ ముఖ్యులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు.
తొలిసారిగా బీసీలకు ఏడు జడ్పీటీసీలు...
స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను ఇస్తామని చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేసింది. దీంతో జిల్లాలో 22 జడ్పీటీసీలకు గానూ తొలిసారిగా ఏడు జడ్పీటీసీలు బీసీలకు రిజర్వ్ కావడంతో బీసీ సామాజిక వర్గాల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. మరో వైపు జడ్పీ చైర్మన్ జనరల్కావడంతో జడ్పీ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీసీలు పావులు
కదుపుతున్నారు.
పల్లెల్లో ఎన్నికల సందడి షురూ..
రిజర్వేషన్ల ప్రకటనతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీల టికెట్ల కోసం పెద్ద ఎత్తున ఆశావహులు రంగంలోకి దిగుతున్నారు. దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికల్లో పోటీపై ఆశావహులు తమ రాజకీయ భవిష్యత్‌పై చర్చించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ, సీపీఎంతో పాటు టీడీపీ, న్యూడెమోక్రసీ నేతలు రిజర్వేషన్లపై చర్చలు సాగిస్తున్నారు.
ఖమ్మం జడ్పీ చైర్మన్ పీఠం ఎస్టీ జనరల్..
ఖమ్మం వెలుగు: ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎస్టీ జనరల్ గా రిజర్వ్ అయింది. మొన్నటి వరకు ఎస్సీ జనరల్‌గా ఉండగా, ఈసారి ఎస్టీకి మారింది. ఎమ్మెల్యే టికెట్ ఆశించి దక్కని వారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డ నాయకులు రిజర్వేషన్లు కలిసి రావడంతో జడ్పీ చైర్మన్ రేస్ లో ఉండాలని భావిస్తున్నారు.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గం నుంచి బాలాజీ నాయక్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గం నుంచి విజయబాయి, మాజీ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మండల స్థాయి జడ్పీటీసీ, ఎంపీపీ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు.