సిండికేట్ లదే హవా!.. లిక్కర్ షాపుల్లో సింహభాగం బినామీలకే

సిండికేట్ లదే హవా!.. లిక్కర్ షాపుల్లో సింహభాగం బినామీలకే
  • రూ.కోటిన్నర వరకు గుడ్​విల్ ఇస్తామంటూ బేరసారాలు 
  • ఖమ్మం జిల్లాలో 116, భద్రాద్రి జిల్లాలో 88 షాపులు
  • భద్రాద్రి జిల్లాలో 26​ షాపులు దక్కించుకున్న మహిళలు

ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక శాతం లిక్కర్​​ షాపులను బినామీలే దక్కించుకున్నారు. వైన్స్​ షాప్స్​ దక్కించుకోవడంలో సిండికేట్స్​ హవా కొనసాగింది. ఖమ్మం జిల్లాలో 116 షాపులు ఉండగా, సీక్వెల్ రిసార్ట్స్​ లో సోమవారం దరఖాస్తుదారులను కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి డ్రాలో పారదర్శకంగా ఎంపిక చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 షాపులకు వచ్చిన దరఖాస్తులను కొత్తగూడెం క్లబ్​లో కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ డ్రా పద్ధతిలో షాపులను కేటాయించారు. దుకాణాలను దక్కించుకున్న వారు సంబురాలు చేసుకోగా, మిగిలిన వారు బాధతో వెనుదిరిగారు. 

మధ్యాహ్నానికే డ్రా ప్రక్రియ ముగియడంతో రెగ్యులర్​ గా మద్యం వ్యాపారం చేసే వారు క్యాష్​ తో రంగంలోకి దిగారు. రూ.కోటిన్నర వరకు గుడ్ విల్ ఇస్తామంటూ ఆఫర్లు ఇచ్చారు. డ్రాలో షాపులను దక్కించుకున్న వారికి మూడో వంతు డబ్బు ప్రభుత్వానికి కట్టేందుకు ఆర్థిక సాయం చేస్తామంటూ ముందుకు వచ్చి, వాటాలివ్వాలంటూ బేరసారాలు జరిపారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 88 వైన్​ షాపులకు 3,922దరఖాస్తులు వచ్చాయి. షాపుల వారీగా డ్రా తీసిన కలెక్టర్​ షాపులను  ఎలాట్​ మెంట్​ చేశారు. వైన్​ షాపులు దక్కించుకున్న వారి వద్ద నుంచి మూడో వంతు లైసెన్స్​ ఫీజును అప్పటికప్పుడే కట్టించుకున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట సర్కిల్స్ పరిధిలో మద్యం వ్యాపారులు సిండికేట్ల వారీగా వందల సంఖ్యలో దరఖాస్తులు వేశారు. 

కొత్తగూడెంకు చెందిన సిండికేట్ల వ్యాపారులు దాదాపు 200 వరకు దరఖాస్తులు వేశారు. దరఖాస్తుల రూపంలో రూ.6 కోట్లు ఖర్చు పెట్టారు. తీరా వాళ్లకు వచ్చింది నాలుగు షాపులే. ఇల్లెందులోని ఓ మద్యం సిండికేట్​ గ్రూపు దాదాపు 154 దరఖాస్తులను రూ. 4.62కోట్లతో వేయగా నాలుగు షాపులకే పరిమితమయ్యారు. మణుగూరుకు సిండికేట్స్​ దాదాపు రూ. 5.10కోట్లతో 170 వరకు దరఖాస్తులు వేయగా నాలుగు షాపులు మాత్రమే దక్కాయి. 

ఇక భద్రాద్రి జిల్లాలో 26షాపులు మహిళలకే దక్కాయి. డ్రా సందర్భంగా కొత్తగూడెం క్లబ్బుకు మహిళలు, యువతులతో పాటు చంటి బిడ్డలతో తరలివచ్చారు. ఇదిలా ఉండగా  కొత్తగూడెంకు చెందిన సతీష్​కు రెండు షాపులు దక్కాయి.  పాల్వంచకు చెందిన బరపాటి శ్రీనివాసరావుకు వరుసగా నాలుగు సార్లు వైన్​ షాపులు దక్కడం విశేషం. గతంలో రెండు సార్లు ఆయన పేర రాగా, గతంలో ఇతరుల పేర ఆయన వేసి దరఖాస్తుదారుడికే షాపు దక్కింది. తాజాగా ఆయన భార్య పేర దరఖాస్తు వేయగా డ్రాలో లక్కిగా షాపును దక్కించుకున్నారు. ఇక జిల్లాలోని అత్యధికంగా పాల్వంచ మండలంలోని పెద్దమ్మ గుడి ప్రాంతంలో వైన్​ షాపుకు 102 దరఖాస్తులు వచ్చాయి. ఈ షాపును శేషగిరి రావు అనే వ్యక్తి దక్కించుకున్నారు.

ఇది బినామీనే. కొత్తగూడెంకు చెందిన ఓ వ్యాపారి రూ. 24లక్షలు పెట్టి 8దరఖాస్తులు, ఇల్లెందుకు చెందిన ఓ మద్యం వ్యాపారి రూ. 45లక్షలు ఖర్చు పెట్టి 15 దరఖాస్తులు వేయగా ఒక్క షాపు దక్కకపోవడంతో ఈసురోమంటూ వెళ్లిపోయారు.  ప్రశాంతంగా వైన్​ షాపుల కేటాయింపు జరిగిందని ఎక్సైజ్​సూపరింటెండెంట్​ జానయ్య పేర్కొన్నారు.  ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. 

ఖమ్మం జిల్లాలో...

ఖమ్మం జిల్లాలో 116 లిక్కర్ షాపులు ఉండగా గౌడ కులస్థులకు 18, ఎస్సీలకు 14, ఎస్టీ లకు 8 రిజర్వ్ చేయగా, మిగతా 76 షాపులను ఓపెన్ టు ఆల్ గా కేటాయించారు. మొత్తం 4,430 దరఖాస్తులు రాగా, అత్యధికంగా గెజిట్ సీరియల్ నెం.27 షాపు కోసం 75, అత్యల్పంగా 73, 75లకు 24 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా దరఖాస్తుల డ్రా ప్రక్రియను మొత్తం వీడియో తీశారు. 

పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు, మద్దతుదారులు హాజరుకావడంతో టోకెన్ ఉన్న వారినే లోనికి అనుమతించారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్లికేషన్​ ఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయించడంతో ఎక్కువ మంది సిండికేట్లుగా కలిసి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో షాపులు కూడా ఎక్కువగా సిండికేట్లకే లభించాయి. మరో వైపు ఎస్టీ, ఎస్సీలతో పాటు గౌడ్స్​కు రిజర్వ్​ అయిన ప్రాంతాల్లో మద్యం సిండికేట్​ వ్యాపారులు బినామీలతో దరఖాస్తులు వేయించారు. 

వ్యవసాయం చేసుకుంటున్న వారితో పాటు షాపుల్లో గుమస్తాలు, తమ ఫ్రెండ్స్​ పేర దరఖాస్తులు చేయించారు. పూట గడవని వారితో కూడా కొందరు మద్యం వ్యాపారులు వారి పేర్లతో అప్లికేషన్లు వేయించి షాపులు దక్కించుకున్న దాఖలాలున్నాయి. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్ర రెడ్డి, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వేణుగోపాల్ రెడ్డి, తిరుపతి, ఎక్సైజ్ సీఐ కృష్ణ పాల్గొన్నారు.