హ్యామ్ తో మన్యం రోడ్లకు మంచి రోజులు!

హ్యామ్ తో మన్యం రోడ్లకు  మంచి రోజులు!
  • 266 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు 
  • రూ.381కోట్ల నిధులతో పనులు 
  • త్వరలో భద్రాచలం–వెంకటాపురం 100 కిలోమీటర్ల రోడ్డు పనులు షురూ.. 

భద్రాచలం, వెలుగు : హైబ్రీడ్​ యాన్యుటీ మోడల్​(హ్యామ్​)తో భద్రాచలం మన్యంలోని రోడ్లకు మంచిరోజులు రానున్నాయి.  266 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి చేసి జిల్లాలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆర్​ అండ్​బీ శాఖ ఇంజినీర్లు ప్రణాళికలు రూపొందించారు. ఈ విధానంలో ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణాలు జరగనున్నాయి. ప్రభుత్వం 40శాతం, కాంట్రాక్టర్లు 60శాతం నిధులు ఖర్చు చేస్తారు.

15 ఏండ్ల కాలంలో కాంట్రాక్టర్లు ఖర్చు చేసిన డబ్బులను ప్రభుత్వం ఇవ్వనుంది. రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లను విస్తరించడం, ట్రాఫిక్​ సమస్యలను నియంత్రించడం, దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయడం, అవసరమైన కొత్త రోడ్ల నిర్మాణం ఈ స్కీంలో చేపట్టనున్నారు. 

రూ.380 కోట్లతో...

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 266 కిలోమీటర్ల రోడ్లను రూ.380.98 కోట్ల నిధులతో నిర్మించడం ఈ స్కీం లక్ష్యం. భద్రాచలం-, చర్ల మార్గంలో 56.80 కిలోమీటర్లు రూ.67.58కోట్లతో, సారపాక-ఏటూరునాగారం మధ్య 58.20 కిలోమీటర్ల రహదారిని రూ.68.93కోట్లతో, అనిశెట్టిపల్లి-, ఆళ్లపల్లి మధ్య 36 కిలోమీటర్ల రోడ్డును రూ.98.88కోట్లతో, పాల్వంచ-దమ్మపేట మధ్య 59 కిలోమీటర్లు రూ.75.93కోట్లతో, తల్లాడ-, కొత్తగూడెం మధ్య 36 కిలోమీటర్లు రూ.52.10కోట్లతో, ఎన్​ఎండీసీ-పినపాక పట్టీనగర్​ మధ్య 20 కిలోమీటర్లు రూ.17.56కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. 

ఇక కష్టాలకు చెల్లుచీటీ..

ఇటీవల ఇసుక లారీల వల్ల మన్యంలో రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రతిపక్షాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి. వాహనదారులు భద్రాచలం నుంచి చర్ల వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు విలీన ఆంధ్రా ఎటపాక మండలం మీదుగా ఎటపాక, కన్నాయిగూడెం పంచాయతీల పరిధిలో భద్రాచలం-, చర్ల ఆర్​ అండ్ ​బీ రహదారి ఉంది. ఇక్కడ కన్నాయిగూడెంలో గ్రామస్తులు దీక్షలు నిర్వహించారు. 

వాహనాలను నిలిపివేశారు. దీనివల్ల పర్ణశాల దేవాలయానికి వెళ్లే భక్తులు కూడా కష్టాలపాలవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చొరవ చూపించి రోడ్లకు రిపేర్లు చేయిస్తున్నారు. హ్యామ్​ నిధులు భద్రాచలం నుంచి చర్ల వరకు రూ.67.58కోట్లతో పనులు ప్రారంభిస్తే ఇక వాహనదారుల కష్టాలకు చెల్లుచీటీ పడినట్లేనని చెప్పొచ్చు.  

త్వరలో పనులు ప్రారంభం

హ్యామ్​ నిధులతో త్వరలో భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు 100 కిలోమీటర్లు ఆర్​అండ్​బీ రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. చర్ల వరకు రూ.67.58 కోట్లు మంజూరయ్యాయి. ములుగు జిల్లాలో ఉన్న చర్ల బార్డర్​ నుంచి వెంకటాపురం వరకు కూడా ఆ జిల్లా నుంచి నిధులు మంజూరయ్యాయి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చాం. తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్యే  భద్రాచలం