ఐదేళ్లుగా.. చలివాగు మాటుపై నిర్లక్ష్యం

ఐదేళ్లుగా.. చలివాగు మాటుపై నిర్లక్ష్యం

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, చిట్యాల, వెలుగు ; భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో  చలివాగు మాటుకు గండి పడి  ఐదేండ్లు అవుతున్నా స్థానిక నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. సుమారు 600 ఎకరాలకు  సాగు నీరందించే చలివాగుపై దృష్టి పెట్టడం లేదు. నిధులు మంజూరైతే బాగు చేస్తామని ఆఫీసర్లు అంటున్నారు. మరో వారం రోజుల్లో వానాకాలం సీజన్‌‌‌‌ ప్రారంభం కాబోతుంది. వరి నాట్ల సమయం దగ్గర పడుతోంది. ఈ సారైనా చలివాగు మాటును రిపేర్‌‌‌‌  చేసి, ఆయకట్టుకు నీరందించాలని రైతులు కోరుతున్నారు. ఆయకట్టు రైతులకు సాగునీరు అందే అవకాశం  ఉందని రైతులు ఎదురు చూస్తున్నారు. జూకల్లులోని చలివాగుపై నిజాం కాలంలో మాటును నిర్మించారు. వాగుకు అడ్డంగా చెక్‌‌‌‌ డ్యాం లాగా నీళ్లను ఆపి కాలువలు తవ్వి  పొలాలకు సాగునీరందించేవారు. దశాబ్దాల తరబడి  రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఈ మాటు కింద అధికారికంగా 526 ఎకరాల ఆయకట్టు ఉండగా అనధికారికంగా మరో 150 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది.

అడుగు భాగంలో  గండ్లు

ఐదేండ్ల కింద మాటకు అడుగు భాగంలో రెండు చోట్ల గండ్లు పడ్డాయి. తూము షెటర్లు పగిలిపోయాయి.    మాటుకు సుమారు ఐదున్నర కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ తో పాటు, ఐదు కిలోమీటర్ల ఉప కాలువలున్నాయి.  గతేడాది ప్రధాన కాలువను  నామమాత్రంగా రిపేర్ చేసి  వదిలేశారు. మాటు మరమ్మతుల కోసం మంజూరైన రూ. లక్షలాది   దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.2.70 కోట్ల ఆర్ ఆర్ ఆర్ నిధులు కోర్టు కేసులతో పెండింగ్ లో ఉన్నాయి. పాలకులు, ఆఫీసర్ల  నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. 

చెక్ డ్యాం బ్యాక్ వాటర్ తో నే మాటు కు ముప్పు!

చెక్ డ్యాం నిర్మాణం కాకముందు మాటుకు నామమా త్రపు రిపేర్లు అయ్యేవని, ఇప్పుడు చెక్ డ్యాం బ్యాక్ వా టర్ తో వల్ల భారీ గండ్లు పడినట్లుగా స్థానికులు చెబు తున్నారు. మాటుకు దిగువన కేవలం 900 మీటర్ల లోపే చెక్ డ్యాం నిర్మించడం నిబంధనలకు విరుద్ధమని, సంబంధిత అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు. చెక్ డ్యాం బ్యాక్ వాటర్ వల్ల మాటు దిగువన ఎల్లప్పుడూ నీరు నిలువ ఉండడం వల్ల ఈ దుస్థితి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

చలివాగు మాటు మాకు ఆధారం 

నేను నీటి యూజర్ కమిటీ చైర్మన్ గా పనిచేశాను. ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పటి నుంచి  ప్రస్తుత సీఎం  వరకు సంబంధిత మంత్రులను, అధికారులను, స్థానిక ఎమ్మెల్యేలలను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరాం... ఇప్పటివరకు మా ఆయకట్టు రైతుల గోడును పట్టించుకునే నాధుడే లేడు. అధికారులు స్పందించి మాటును బాగు చేయాలి. 
‒ కంది మాధవరెడ్డి, మాజీ ఛైర్మన్‌‌‌‌, జూకల్‌‌‌‌ రైతు

రిపేర్‌‌‌‌ చేయిస్తాం

వరదల వల్ల చలివాగు మాటుకు గండి పడింది. వేసవిలో కూడా నీటి ప్రవాహం తగ్గడం లేదు. నీటి ప్రవాహానికి అడ్డంగా ఇసుక బస్తాలు వేసి, మరమ్మతుల కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. మాటు దిగువన ఉన్న చెక్ డ్యాం నీటిని బయటకి పంపి, పనులు చేయాల్సి ఉంది. రూ. 20 లక్షల నిధుల తో మరమ్మతు పనులు చేపట్ట నున్నాం. టెండర్‌‌‌‌ ప్రక్రియ పూర్తయింది. మరో వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తాం.
‒ దిలీప్, ఐబీ ఏఈ, చిట్యాల

బీడు భూములుగా మారుతున్నయ్‌‌‌‌

మా  పక్కనే చలివాగు, ఎగువన చెరువులు ఉన్నా మధ్యలో మా పొలాలు బీడు భూములుగా మారిపోయినయి. స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు  చలి వాగు మాటును పట్టించుకోలేదు.  కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై  మాటు రిపేర్లకు వచ్చిన డబ్బులు కాజేస్తున్నారు.  ఉపాధి హామీ పథకంలో సైతం కాలువల మరమ్మతు  పేరుతో అవకతవకలు జరిగాయి. 
- పోలోజు సంతోష్, ఆయకట్టు రైతు, జూకల్‌‌‌‌