బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ పదో వారం వీకెండ్ ఎపిసోడ్ ( 69వ రోజు ) ఊహించని ట్విస్టులు, తీవ్ర భావోద్వేగాలతో ప్రేక్షకులకు కట్టిపడేసింది. హోస్ట్ కింగ్ నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన' పాటతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి, హౌస్‌మేట్స్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఈ వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ తో పాటు 'నో ఫ్యామిలీ వీక్' అనే మరో పెద్ద బాంబ్ వేసి బిగ్ బాస్ హౌస్‌ను షేక్ చేశారు.
నాగ్ అక్షింతలు..
వారం రోజులు జరిగిన ఆట తీరుపై నాగార్జున 'కత్తులు - క్లాప్స్' కాన్సెప్ట్‌తో హౌస్‌మేట్స్‌కు తమ పర్ఫార్మెన్స్ గురించి వివరించారు. తనూజ, డీమోన్ పవన్ ఇష్యూపై గట్టిగానే క్లాస్ పికారు నాగార్జున. కొత్త కెప్టెన్ తనూజను అభినందించినప్పటికీ, డీమోన్ పవన్‌తో గొడవ విషయంలో ఆమె వ్యవహరించిన తీరుపై నాగ్ తీవ్రంగా మందలించారు. "బుర్ర లేకుండా హౌస్‌లో ఆడపిల్లని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడనే నిందలు వేయొద్దు కదా?" అంటూ ఆమె కత్తిని విరగ్గొట్టారు.
ఫెయిల్డ్ సంచాలక్..
అటు సంచాలక్‌గా రీతూ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలపై నాగార్జున పైర్ అయ్యారు. "బిగ్‌బాస్ నా తరఫున చిన్న రిక్వెస్ట్.. ఇక నుంచి రీతూని సంచాలక్‌గా పెట్టకండి... ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చేస్తావ్" అంటూ తీవ్రంగా హెచ్చరించారు. సుమన్ శెట్టి - సంజన టవర్ టాస్క్‌లో కల్యాణ్ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా, వివరణ సరిగ్గా ఇవ్వలేదంటూ అతడిని'ఫెయిల్డ్ సంచాలక్'గా ప్రకటించి కత్తి విరిచేశారు. ఇక భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి కామెడీకి నాగ్ నుంచి ప్రశంసలు దక్కాయి. అలాగే, లాస్ట్ వీక్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నిఖిల్‌ని కూడా అభినందించారు.
సంజనాకు 'నో ఫ్యామిలీ వీక్' షాక్
హౌస్‌మేట్స్‌కు రెండు బిగ్ బాంబ్స్ ఉన్నాయంటూ ప్రకటించిన నాగార్జున, అందులో రెండో బాంబ్ ఎవరిపై పడుతుందో తెలుసుకునేందుకు 'ముంచేది తేల్చేది' అనే టాస్క్ పెట్టారు. ఈ టాస్క్‌లో నలుగురు ఇంటి సభ్యులు సంజన వల్లే తమ ఆట కిందకి పోతుందని పేరు చెప్పారు. దీంతో, ఆ రెండో బాంబ్ సంజనపై పడింది. ఆ బాంబు తెరచి చూడగా అందులో 'నో ఫ్యామిలీ వీక్' అని రాసి ఉంది. ఫ్యామిలీ వీక్‌లో తన చిన్న పిల్లలను, భర్తను చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సంజన, ఈ షాక్‌తో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. "సార్ నేను ఇంటికెళ్లిపోతాను సార్.. నా వల్ల కాదు.. నేను చచ్చిపోతా" అంటూ ఆమె గుక్కపెట్టి ఏడ్చింది. కానీ, ఇది మెజారిటీ హౌస్‌మేట్స్ నిర్ణయమని, ఊహించనివి జరుగుతాయని నాగార్జున ఆమెకు నచ్చజెప్పారు.
నిఖిల్ నాయర్ ఎలిమినేషన్
నామినేషన్స్‌లో లేని ఇమ్మూ, కెప్టెన్ అయిన తనూజ మినహా మిగతా వారందరినీ ఎలిమినేషన్ కోసం గార్డెన్ ఏరియాకు పిలిచారు నాగార్జున. ఫిష్ బౌల్స్‌లో బాటిల్ లిక్విడ్ పోసే ప్రక్రియలో చివరగా నిఖిల్, సంజన మిగలగా... నిఖిల్ ఫిష్ బౌల్ కలర్ మారకపోవడంతో, నిఖిల్ నాయర్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. నిఖిల్ ఎలిమినేట్ కాగానే సంజన తీవ్రంగా ఎమోషనల్ అయింది. స్టేజ్ మీదకు వచ్చిన నిఖిల్‌ను నాగార్జున అభినందించారు. హౌస్‌మేట్స్ గురించి చెప్పమని అడగగా, తనూజలో ఏడుపు, రీతూలో కన్ఫ్యూజన్, దివ్యలో ఓవర్ కమాండింగ్, భరణిలో సైలెన్స్ నచ్చవని చెప్పి నిఖిల్ హౌస్‌కు గుడ్‌బై చెప్పాడు. ఒక్క వీకెండ్ ఎపిసోడ్‌లో రెండు బలమైన షాక్‌లు పడటంతో హౌస్‌లో గేమ్ మరింత రసవత్తరంగా మారనుంది.
