బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ షో 12వ వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్ లో కేవలం 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. అయితే ఈ వారం హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ గండం పొంచి ఉందని సమాచారం. నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ అగ్గి రాజేయగా.. ఈరోజు మొదలైన 'కెప్టెన్సీ' టాస్క్ హౌస్‌లో మరింత హీట్ ను పెంచింది.
కెప్టెన్సీ కోసం సరికొత్త వ్యూహం..
ఈ 12వ వారం కెప్టెన్సీ చాలా కీలకం. ఎందుకంటే, ఈ వారం తరువాత హౌస్‌కి కెప్టెన్ ఉండరు. అందుకే ఈ చివరి కెప్టెన్సీ యుద్ధానికి బిగ్ బాస్ ఊహించని విధంగా తెరతీశారు. గతంలో ఇంటి సభ్యులు తమలో తామే పోటీపడి కెప్టెన్ అయ్యేవారు. కానీ ఈసారి బిగ్ బాస్ చేసిన ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. 'ఈసారి మీరు చేసే యుద్ధం.. మీతో మీకు కాదు.. బయట నుంచి వచ్చే యోధులతో' అంటూ బిగ్ బాస్, మాజీ కంటెస్టెంట్స్‌ను రంగంలోకి దింపారు. ఈ నిర్ణయం హౌస్‌మేట్స్‌కు షాక్ ఇచ్చింది. తాజా కెప్టెన్సీ టాస్క్‌లో హౌస్‌లోని కంటెస్టెంట్స్, బయటి నుంచి వచ్చిన మాజీ సభ్యులతో పోటీపడి గెలవాల్సి ఉంటుంది.
గౌతమ్ కృష్ణ ఎంట్రీతో భరణి ఆశలు గల్లంతు..
ఈ క్రమంలోనే గత సీజన్లలో తనదైన ఆటతో 'పీపుల్ విన్నర్'గా ముద్ర వేయించుకున్న గౌతమ్ కృష్ణ పంచెకట్టుతో బిగ్ బాస్ హౌస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌తో సరదా ముచ్చట్లు పెట్టిన గౌతమ్, సుమన్ శెట్టిని ఉద్దేశిస్తూ... అతను అరుస్తుంటే ఎక్కడ బీపీ వచ్చి పోతాడేమో అని భయంగా ఉందనేసి అందరినీ నవ్వించాడు. అనంతరం, గౌతమ్... ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయిన భరణి శంకర్‌తో మొదటి పోరుకు సిద్ధమయ్యాడు.
భరణి కూతురు ఈ వారం తన తండ్రి కెప్టెన్ అవ్వాలని ఆశించినా, ఆ ఆశ తీరలేదు. ఈ హోరాహోరీ పోరులో గౌతమ్ కృష్ణ విజయం సాధించినట్లు సమాచారం. దీంతో భరణి శంకర్ కెప్టెన్సీ రేస్ నుంచి నిష్క్రమించాడు. కేవలం చివరి వారంలో కెప్టెన్సీ సాధించాలనే భరణి కల మరోసారి భగ్నమైంది.
డేంజర్ జోన్‌లో ఎవరు?
ఒకవైపు కెప్టెన్సీ పోరు జరుగుతుంటే, మరోవైపు ఈ వారం జరగనున్న డబుల్ ఎలిమినేషన్ చర్చ హౌస్‌లో, బయట హాట్‌టాపిక్‌గా మారింది. 8 మంది నామినేషన్స్‌లో ఉండగా రీతూ చౌదరి కెప్టెన్ కావడంతో సేఫ్ అయింది., గత వారం అతి తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉండి సేవ్ అయిన సంజన గల్రానీ , దివ్య నిఖిత ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కారణంగా ఇంటికి వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ తీసుకునే చిత్ర విచిత్రమైన నిర్ణయాల నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో చూడాలి!
