తాగొచ్చారా?.. బీజేపీ ఎమ్మెల్యేలపై నితీశ్ ఆగ్రహం

తాగొచ్చారా?.. బీజేపీ ఎమ్మెల్యేలపై నితీశ్ ఆగ్రహం

బీహార్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాటల తూటాలు పేల్చారు. చాప్రాలో కల్తీ మద్యం తాగి 9 మంది చనిపోయిన ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. జేడీయూ–ఆర్జేడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. మద్యం నిషేధంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీనేతలు విమర్శించారు. 

దీంతో ఆగ్రహానికి గురైన సీఎం నీతీశ్ కుమార్‌ విపక్షాలపై విరుచుకుపడ్డారు. "ఏం జరుగుతోంది? అరవకండి.. మద్యం సేవించి సభకు వచ్చారా? మీరు చేస్తున్నది కరెక్ట్‌ కాదు. దీన్ని ఎంతమాత్రం సహించేది లేదు" అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం నిషేదం చేస్తామంటే.. బీజేపీ నేతలే వ్యతిరేకిస్తున్నారని నితీశ్ కుమార్ ఆరోపించారు. కల్తీ మద్యం తెచ్చి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. దీంతో అసహనానికి గురైన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అధికార–ప్రతిపక్షాల విమర్శలతో సభను స్పీకర్ వాయిదా వేశారు. 

కాగా, రెండో రోజు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. శాంతిభద్రతలు, అభివృద్ధి, నిరుద్యోగంపై నిరసన వ్యక్తం చేశారు. ఆగస్ట్ లో మహాఘటబంధన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేతలు ఆరోపించారు. బీహార్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.