లోక్​సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్​కు తాళం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

లోక్​సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్​కు తాళం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •     ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 
  •     రెండు, మూడు సీట్లలో డిపాజిట్లు దక్కించుకునేందుకే కేసీఆర్ తాపత్రయం
  •     జూన్ 5న కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 
  •     బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో అధ్యక్ష తరహా పాలన
  •     ‘మీట్ ది ప్రెస్’లో మంత్రి వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: ఈసారి లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని..  రెండు, మూడు సీట్లలో డిపాజిట్లు దక్కించుకునేందుకే కేసీఆర్ తాపత్రయ పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఆఫీసుకు తాళం వేస్తారన్నారు. ‘‘ఈసారి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి మధ్యే పోటీ ఉంది. మా టార్గెట్ 15 సీట్లు. 14 సీట్లలో తప్పకుండా గెలుస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. 

బుధవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో వెంకట్ రెడ్డి మాట్లాడారు. “అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్ట ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లోనూ అదే తీర్పు ఇస్తారు. కేసీఆర్ గురించి చెప్పాలంటే రామాయణమంతా చెప్పాలి. ఆయనో వేస్ట్ ఫెలో.. అతని గురించి మాట్లాడుకుంటే టైమ్ వేస్ట్. కేసీఆర్ పదేండ్లు రాష్ర్టాన్ని దోచుకుని, ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నడు. 

కేసీఆర్ చేసిన తప్పులకు ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పు లేదు. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ‘టైమ్ ఇవ్వండి.. రాష్ట్రాన్ని సెట్ చేస్తా’ అంటే అందరూ ఓపిక పట్టారు. కానీ ఇప్పుడు మేం వచ్చి 4 నెలలే అయింది. మరి మాకు టైమ్ ఇవ్వకుండా అనవసర అరోపణలు చేస్తున్నడు” అని ఫైర్ అయ్యారు. మాజీ ఎంపీ సంతోష్ టానిక్ పేరుతో వైన్ షాప్ పెట్టి ఎక్కువ ధరకు మద్యం అమ్మి రూ.5 వేల కోట్లు సంపాదించారని, బీఆర్ఎస్ నేతలు ధరణి పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ‘‘హరీశ్ రావు.. అగ్గి పెట్టె రావు. రెండు పేజీల డ్రామా రాజీనామా లెటర్ రాసుకొని వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నడు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లెటర్ ఎలా ఉంటదో 5,6 సార్లు గెలిచిన హరీశ్ కు తెల్వదా? ఫుల్ స్టాప్, కామా తప్పు పెట్టినా రాజీనామా లేఖ చెల్లదు” అని తెలిపారు. 

బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు నన్ను కలిసిన్రు.. 

రాష్ర్టంలో పదేండ్లు తామే అధికారంలో ఉంటామని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘‘2026లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. సీట్లు 150కి పైగా పెరుగుతాయి. అప్పుడు 120 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది” అని జోస్యం చెప్పారు. కేసీఆర్ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని.. కేసీఆర్ చేసిన అప్పులు, వడ్డీలు నాలుగు నెలల నుంచి కడుతున్నామని పేర్కొన్నారు. ‘‘లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవిత.. ప్రజ్వల్ రేవణ్ణతో పోల్చుకున్నారు. ఆమె మాటలు విని నేను నవ్వుకున్నాను. వాళ్లిద్దరూ తప్పులే చేశారు. 

ఇద్దరూ శిక్ష అనుభవించడం ఖాయం” అని అన్నారు. సోమేశ్ కుమార్ ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా కేసీఆర్ తయారు చేశారని అన్నారు. జులైలో ఆర్ఆర్ఆర్ టెండర్లు పిలుస్తామని, అలైన్ మెంట్ మార్చకుండా రైతులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. మూసీ ప్రక్షాళనను సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, జైకాతో పాటు ఇతర సంస్థల నుంచి లోన్లు తెచ్చి అది పూర్తి చేస్తామన్నారు. 

‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరు కూడా బీఆర్ఎస్ లో చేరరు. జూన్ 5న కాంగ్రెస్ లోనే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారు. ఇటీవల ఆరేడు మంది బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు నా దగ్గరకు వచ్చి నామినేషన్ విత్ డ్రా చేసుకుంటామని చెప్పారు. కానీ వాళ్లను పోటీలో ఉండాలని నేనే చెప్పాను” అని పేర్కొన్నారు. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ కచ్చితంగా చేస్తామన్నారు.    

బీజేపీకి 300 సీట్లు వస్తే.. ఇక ఎన్నికలు ఉండవ్ 

బీజేపీకి ఈసారి 300 నుంచి 400 సీట్లు వస్తే 2029లో ఎంపీ ఎన్నికలే ఉండవని కోమటిరెడ్డి అన్నారు.  రష్యా తరహాలో అధ్యక్ష పాలన వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి ఒకట్రెండు సీట్లకు మించి రావని, మొత్తంగా దక్షిణాదిలో ఆ పార్టీకి 10 సీట్లు కూడా రావని అన్నారు. ‘‘బీజేపీ వాళ్లు ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రకటించి మత కలహాలు సృష్టిస్తున్నారు. దేశంలో 20 నుంచి 25 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వాళ్లందరినీ బీజేపీ బాధపెడుతున్నది. ఓట్లు , అధికారం కోసం ఇలా చేస్తరా?” అని మండిపడ్డారు. మోదీ ఇన్ని రోజులు అచ్చే దిన్ అంటూ ఓట్లు అడిగారని..  ఇప్పుడు రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. రాష్ర్టంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. మోదీనే దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారని మండిపడ్డారు.  

మోదీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగం ఉండదు

నల్గొండ, వెలుగు: పొరపాటునో, గ్రహపాటునో మోదీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగం ఉండదని.. రష్యా, చైనా మాదిరిగా అధ్యక్ష తరహా పాలన వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ చేసిన అభివృద్ధిపై ఓట్లు అడగకుండా, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు ఎత్తివేస్తాం, రాజ్యాంగాన్ని సవరిస్తామని ప్రధాని మాట్లాడటం సరికాదన్నారు. అకాల వర్షాలతో  తడిసిన వడ్లను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.