మల్కాజిగిరిలో మాయ చేసేదెవరో?

మల్కాజిగిరిలో మాయ చేసేదెవరో?
  • సునీతారెడ్డిని గెలిపించేందుకు సీఎం వ్యూహం
  • వ్యక్తిగత ఇమేజ్, మోదీ చరిష్మా గెలిపిస్తుందంటున్న ఈటల  
  • ప్రజలు తమ వైపే ఉన్నారంటూ బీఆర్ఎస్​ అభ్యర్థి ప్రచారం

హైదరాబాద్, వెలుగు :  దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి పార్లమెంట్​లో మూడు ప్రధాన పార్టీల మధ్య టఫ్​ ఫైట్​నడుస్తోంది. సిట్టింగ్​సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​అభ్యర్థి సునీతామహేందర్​రెడ్డిని గెలిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక కేంద్రంలో మోదీ చరిష్మాతో ఈసారి తన గెలుపు ఖాయమన్న ధీమాతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ప్రచారంలో జోరు పెంచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్​నియోజకవర్గ పరిధిలోని అన్ని  స్థానాలను బీఆర్ఎస్​ కైవసం చేసుకోగా, తన గెలుపు పెద్ద కష్టం కాదని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నమ్మకంతో ఉన్నారు. దేశంలోనే పెద్ద నియోజకవర్గంగా పేరున్న మల్కాజిగిరిలో 37,28,417 మంది ఓటర్లుండగా పురుషులు 19,21,756, మహిళా ఓటర్ల సంఖ్య18,06,134 ఉంది. 527 మంది ట్రాన్స్​జెండర్లు ఉన్నారు. అత్యధిక శాతం బీసీ ఓటర్లు కాగా.. సెటిలర్లు, మైనారిటీలు, యువ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఈ నియోజక వర్గం నుంచి 2018 ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డి కాంగ్రెస్​అభ్యర్థిగా పోటీ చేసి  6,03,748 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్​ పార్టీకి చెందిన మర్రి రాజశేఖరరెడ్డిపై 10,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​ల నుంచి బలమైన అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.  

సెటిలర్లు, మైనారిటీలే కీలకం

ఈ పార్లమెంట్​నియోజక వర్గ పరిధిలోకి ఎల్​బీనగర్​, మేడ్చల్​, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్​, కూకట్​పల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్​అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ముఖ్యంగా ఎల్​బీనగర్, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్​నియోజకవర్గాల్లో ఏపీ ఓటర్లే కీలకం. వీరు దాదాపు యాబై శాతానికి మించి ఉండడంతో గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. అలాగే మైనారిటీల సంఖ్యా తక్కువేం కాదు. మేడ్చల్, మల్కాజిగిరి, కంటోన్మెంట్ ​నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. బ్రాహ్మణులు, తమిళ ఓటర్లు కూడా ఎక్కువే. ప్రతిసారి ఎన్నికల్లో సీమాంధ్రులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోని ఓటింగ్​శాతమే అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తోంది. ఈసారి కూడా సీమాంధ్రులు, బీసీలు, మైనారిటీలు కీలకం కావడంతో, దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలు ప్రచారంలో ప్లాన్లు అమలు చేస్తున్నాయి.  

సిట్టింగ్​సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్​ స్కెచ్​ 

కాంగ్రెస్​ పార్టీ సిట్టింగ్​ సీటు అయిన మల్కాజిగిరి పార్లమెంట్​ సెగ్మెంట్​ను నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. సిట్టింగ్​ ఎంపీ రేవంత్​రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఈసారి మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్​రెడ్డిని గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేశారు. కాంగ్రెస్​పార్టీ అధికారంలో ఉండడం, ఆరు గ్యారంటీలు గెలిపిస్తాయని ఆ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్​రెడ్డి ధీమాతో ఉన్నారు. ఆమె భర్త మహేందర్​రెడ్డి మాజీ మంత్రి కావడంతో ఆయనకు ఉన్న పరిచయాలు తన గెలుపుకు దోహదం చేస్తాయని అమె నమ్ముతున్నారు. ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలు కూడా అదే స్థాయిలో గెలుపు కోసం పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సైతం మల్కాజిగిరిలో రోడ్​షోలు నిర్వహించారు. సునీతా మహేందర్​రెడ్డి కూడా నియోజకవర్గంలోని కీలకమైన ఎల్​బీనగర్​, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్​, మల్కాజిగిరి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలోనూ కాంగ్రెస్​అధికారంలోకి వస్తుందని, ఈ నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానంటూ ఆమె ప్రచారంలో హామీ ఇస్తున్నారు.

గెలుపు తమదేనంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్​అభ్యర్థిగా ఈసారి ఊహించని విధంగా రాగిడి లక్ష్మారెడ్డి తెరపైకి వచ్చారు. మల్కాజిగిరి స్థానం నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తారని లేదా ఆయన కొడుక్కి టికెట్​ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. చివరకు ఉప్పల్​నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​అభ్యర్థిగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ తరఫున పార్లమెంట్​ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాగిడికి టిక్కెట్​దక్కిందన్న ప్రచారం జరిగింది. ఆయన కూడా అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ప్రచారం మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నా ప్రచారంలో మాత్రం అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. దీంతో లక్ష్మారెడ్డి కేటీఆర్,కేసీఆర్​ల ప్రచారాన్నే నమ్ముకున్నారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సెటిలర్లు అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కనే పార్లమెంట్​ఎన్నికల్లోనూ సపోర్ట్​చేసి గెలిపిస్తారని లక్ష్మారెడ్డి నమ్ముతున్నారు.

మోదీ చరిష్మానే నమ్ముకున్న బీజేపీ 

మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్​బరిలో నిలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్​తో పాటు గజ్వేల్​అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ కు ఇక్కడ గెలవడం చాలా అవసరం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు బీఆర్ఎస్​లో సుమారు ఏడేండ్లు మంత్రిగా పని చేశారు. కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్​ను వీడి బీజేపీలో చేరిన ఆయన మల్కాజిగిరి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వ్యక్తిగత ఇమేజ్​తో పాటు మోదీ ఛరిష్మా, ​కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అయోధ్య రామమందిర నిర్మాణం గెలుపుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. మరోవైపు ఈటల రాజేందర్​కు టికెట్​ఇవ్వడంపై పార్టీలోని ఒక వర్గం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.