
ఇస్తాంబుల్: ఇండియా స్టార్ రెజ్లర్లు అమన్ షెరావత్ (57 కేజీ), దీపక్ పూనియా (86 కేజీ) ఒలింపిక్స్ బెర్త్‌లపై గురి పెట్టారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి జరిగే వరల్డ్ క్వాలిఫయర్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో ఆడిన వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా క్వాలిఫయర్స్‌లో అమన్ కచ్చితంగా అర్హత సాధిస్తాడని భావించినా నిరాశపర్చాడు. ఇక దుబాయ్‌లో భారీ వర్షం కారణంగా దీపక్ పూనియా, సుజీత్ కల్కాల్ (65 కేజీ) సరైన సమయంలో బిష్కెక్‌కు చేరుకోలేకపోయారు. దీంతో మెగా గేమ్స్‌కు ఇది చివరి అర్హత టోర్నీ కావడంతో ఈ ఇద్దరు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.