సిక్‌‌ లీవ్స్‌‌పై ఎయిర్​ ఇండియా ఉద్యోగులు.. 78  విమాన సర్వీస్‌లు రద్దు

 సిక్‌‌ లీవ్స్‌‌పై ఎయిర్​ ఇండియా ఉద్యోగులు.. 78  విమాన సర్వీస్‌లు రద్దు

న్యూఢిల్లీ:  కొంత  మంది క్యాబిన్ క్రూ ఉద్యోగులు చివరి నిమిషంలో  సిక్‌‌ లీవ్స్ పెట్టడంతో  మంగళవారం సాయంత్రం నుంచి 78 విమాన సర్వీస్‌‌లను  ఎయిర్‌‌‌‌ ఇండియా ఎక్స్‌‌ప్రెస్  క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.  మరికొన్ని  విమాన సర్వీస్‌‌లు ఆలస్యంగా మొదలయ్యాయి. ఎయిర్‌‌‌‌ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది.  కంపెనీలో వస్తున్న మార్పులకు వ్యతిరేకంగా చాలా మంది ఉద్యోగులు నిరసన తెలియజేస్తున్నారు.  ఏఐఎక్స్ కనెక్ట్‌‌ (గతంలో ఎయిర్‌‌‌‌ ఏషియా  ఇండియా) ను ఎయిర్ ఇండియా ఎక్స్‌‌ప్రెస్‌‌లో విలీనం చేయడానికి 2023 లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులు ఇచ్చింది.

క్యాబిన్ క్రూతో సహా చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ‘కొంత మంది క్యాబిన్ క్రూ ఉద్యోగులు  చివరి నిమిషంలో తమ ఆరోగ్యం బాగోలేదని రిపోర్ట్ చేశారు. ఫలితంగా చాలా విమాన సర్వీస్‌‌లు ఆలస్యంగా మొదలయ్యాయి. కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఈ ఇష్యూపై చర్చలు జరుపుతున్నాం. కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకున్నాం’ అని ఎయిర్ ఇండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ స్పోక్స్‌‌పర్సన్‌‌ వెల్లడించారు. విమాన సర్వీస్‌‌లు క్యాన్సిల్ అవ్వడం వలన ఇబ్బంది పడిన  కస్టమర్లకు రిఫండ్ చేస్తామని లేదా మరో డేట్‌‌లో సర్వీస్‌‌లు ప్రొవైడ్ చేస్తామని అన్నారు. ఈ ఇష్యూపై ఫుల్‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌ సబ్మిట్ చేయాలని  ఏవియేషన్ మినిస్ట్రీ కంపెనీని అడిగింది.