మన రాజ్యాంగం ప్రమాదంలో ఉంది: కోదండరాం

మన రాజ్యాంగం ప్రమాదంలో ఉంది: కోదండరాం
  •  రాసింది బ్రిటీషువాళ్లనిప్రచారం చేస్తున్నరు
  • రైతులు వ్యవసాయం కన్నా సెక్యూరిటీ గార్డ్ నౌకరి నయమని అనుకుంటున్నరు
  • టీజేఎస్ చీఫ్ కోదండరాం

ఆసిఫాబాద్, వెలుగు :  మన రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దీన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అంశంపై ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని రోజ్​గార్డెన్స్​లో నిర్వహించిన సమావేశానికి హాజరైన కోదండరాం మాట్లాడారు. 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. వాజ్​పేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ జస్టిస్​వెంకటాచలం కమిషన్​వేశారని, అప్పుడు వీలు కాలేదని, రాజ్యాంగాన్ని ఎట్లయినా మార్చాల్సిందేనంటూ పట్టుదలతో ఉన్నారన్నారు. మన రాజ్యాంగాన్ని బ్రిటీష్ వాళ్లు రాశారని ప్రచారం చేస్తున్నారన్నారు. మనుషులంతా సమానంగా ఎదగడానికి రాజ్యాంగం అవకాశం కల్పించిందని, అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. భారతదేశంలో అసమానతలు పెరుగుతున్నాయని, సామాన్య ప్రజలు, రైతులు బతికే పరిస్థితి లేదన్నారు. అంబానీ ఆదాయం లక్ష 50వేల కోట్ల నుంచి రూ.7లక్షల 50 వేల కోట్లకు పెరిగిందని, ఆదానీ ఆదాయం 25 వేల కోట్ల నుంచి రూ. 7లక్షల 50 వేల కోట్ల కు పెరిగిందన్నారు. సామాన్య ప్రజల ఆదాయం మాత్రం నాలుగింతలు కిందకు పడిపోయిందన్నారు. రైతులు వ్యవసాయ చేయడం కంటే పట్టణాల్లో సెక్యూరిటీ గార్డుగా చేయడం నయం అని అనుకుంటున్నారన్నారు. టీజేఎస్ ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి బాబాన్న, డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, సీనియర్ జర్నలిస్ట్ మునీర్ పాల్గొన్నారు.

మోదీని గద్దె దించాల్సిందే 

మెట్ పల్లి : దేశంలో ప్రజాస్వామ్యం బతకాలన్నా, రిజర్వేషన్లు కొనసాగాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. ప్రజలకు పేదరికం నుంచి  విముక్తి కలిగి సంపద పెరగాలన్నా మోదీ సర్కార్‌‌ను గద్దె దించాల్సిన అవసరముందని కోదండరాం అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో నిర్వహించిన టీజేఎస్‌ కోరుట్ల నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీఎస్టీ పేరిట పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులపై ట్యాక్సులు వేసిన బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నుంచి రూ.57 లక్షల కోట్లు వసూలు చేసిందన్నారు. మోదీ సర్కార్‌కు అరబ్‌ దేశాలతో సఖ్యత లేకపోవడంతో‌ ఇక్కడ ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్తున్న యువతకు అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. చేతి గుర్తుకు ఓటేసి రైతు బిడ్డ  జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కంతి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగారావు, లీడర్లు శంకర్, మహేందర్ రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, శశి, ఆనంద్, దిలీప్, అశోక్, సతీశ్‌, రాంపల్లి శ్యామ్ పాల్గొన్నారు.