హర్యానాలో రాజకీయ సంక్షోభం : సీఎం నాయబ్​ సైనీ

హర్యానాలో రాజకీయ సంక్షోభం : సీఎం నాయబ్​ సైనీ
  • బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యేలు
  • మరుసటి రోజే జేజేపీ ఝలక్
  • ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్​కు మద్దతిస్తామని వెల్లడి
  • తమ సర్కారుకు ఢోకాలేదంటున్న సీఎం నాయబ్​ సింగ్​ సైనీ

చండీగఢ్: హర్యానాలో బీజేపీ సర్కారు సంక్షోభంలో పడింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్న మరుసటిరోజే జన్​నాయక్​ జనతా పార్టీ (జేజేపీ) బీజేపీకి చేదు వార్త వినిపించింది. రాష్ట్రంలో బీజేపీ సర్కారును గద్దె దించేందుకు తమ పార్టీ సహకరిస్తుందని కాంగ్రెస్​కు సూచించింది. అయితే, తమ ప్రభుత్వం మైనారిటీలో పడలేదని, సర్కారుకు ఎలాంటి ఢోకా లేదని సీఎం నాయబ్​ సైనీ తెలిపారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురు సోంబీర్​ సాంగ్వాన్​ (దాద్రి), రన్​దీర్​ సింగ్​ గొల్లెన్​ (పుండ్రి), ధరమ్​పాల్​ గొండేర్ (నిలోఖేరీ) మంగళవారం బీజేపీకి తమ మద్దతు ఉపసంహరించుకున్నారు. 

అవిశ్వాసానికి మద్దతిస్తం: జేజేపీ

అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే తాము బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తామని జేజేపీ లీడర్ ​దుష్యంత్​ చౌతాలా తెలిపారు. హిసార్​లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుత సర్కారు మైనారిటీలో ఉంటే.. బీజేపీ సర్కారును గద్దె దించే ప్రయత్నం చేస్తే .. మేం బయటనుంచి తప్పకుండా కాంగ్రెస్  పార్టీకి  మద్దతు ఇస్తాం’’ అని చౌతాలా తెలిపారు. 

సర్కారుకేం ఢోకాలేదు: బీజేపీ

రాష్ట్రంలో ప్రభుత్వానికి ఢోకా లేదని, తమ ప్రభుత్వం పటిష్టంగా ఉందని సీఎం సైనీ చెప్పారు. ఎన్నికల వేళ బీజేపీ సర్కారు మైనారిటీలో ఉన్నదని ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్​ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని, బీజేపీ సర్కారుకు ఎలాంటి ప్రమాదం లేదని మాజీ సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​ తెలిపారు.

రాష్ట్రపతి పాలన విధించాలి: కాంగ్రెస్​

ముగ్గురు ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ సర్కారు మైనారిటీలో పడిందని, హర్యానాలో రాష్ట్రపతి పాలన విధించాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. బీజేపీ సర్కారును బర్తరఫ్​ చేయాలని డిమాండ్ చేస్తూ హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయకు లేఖ రాస్తామని తెలిపింది.

హంగ్​ అసెంబ్లీ ఏర్పడే చాన్స్​

హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్​కు 30 మంది ఎమ్యెల్యేలు ఉన్నారు. బీజేపీకి మద్దతు విత్​డ్రా చేసుకున్న ఇండిపెండెంట్లతో కలుపుకొని  ఆ పార్టీ సంఖ్యా బలం 33కు చేరింది. అంటే మెజారిటీకి ఇంకా 13 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. రాష్ట్రంలో ఏ ఒక్కపార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ లేదు. దీంతో హంగ్​ ఏర్పడే అవకాశం ఉన్నది.

అసెంబ్లీలో పార్టీల బలాబలాలు..

హర్యానా అసెంబ్లీలో మొత్తం 90  స్థానాలు ఉన్నాయి. వాటిలో కర్నాల్​, రానియా శాసన సభ్యుల రాజీనామాలతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక మిగిలిన 88 సీట్లలో బీజేపీకి 40, కాంగ్రెస్ కు 30, జేజేపీకి 10 సీట్ల సంఖ్యా బలం ఉన్నది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 45 మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే, ప్రభుత్వ ఏర్పాటు సమయంలో బీజేపీకి మద్దతు ఇచ్చిన జేజేపీ అనంతరం ఉపసంహరించుకున్నది. దీంతో ఇండిపెండెంట్లతో సైనీ ప్రభుత్వం నడుస్తున్నది. తాజాగా, ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా మద్దతు ఉపసంహరించుకున్నారు.