బీజేపీని గెలిపిస్తే బీసీ సీఎం : అమిత్​షా

బీజేపీని గెలిపిస్తే బీసీ సీఎం :  అమిత్​షా
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ పార్టీలు.. వాటికి జనం గోస పట్టదు
  • పేదలు, వెనుకబడిన వర్గాల కోసం పని చేసేది బీజేపీనే
  • కేటీఆర్‌‌‌‌ను సీఎం చేయాలని కేసీఆర్, 
  • రాహుల్‌‌ను ప్రధాని చేయాలని సోనియా ప్రయత్నం
  • దళితుడిని సీఎం చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్న

సూర్యాపేట, వెలుగు:  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​షా ప్రకటించారు. పేదలు, వెనుకబడిన వర్గాల కోసం బీజేపీ పని చేస్తున్నదని, తమను గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌తో తెలంగాణ అభివృద్ధి జరగదని, నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. శుక్రవారం సూర్యాపేటలో జరిగిన జన గర్జన సభలో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. బీజేపీని ఆశీర్వదించి.. అధికారమివ్వండి. మా పార్టీ పవర్‌‌‌‌లోకి వస్తే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారు” అని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండూ ఫ్యామిలీ పార్టీలేనని మండిపడ్డారు. ఆ పార్టీలు తెలంగాణకు మేలు చేయవని, వాటికి జనం గోస పట్టదని, కుటుంబం కోసమే పని చేస్తాయని విమర్శించారు. కేటీఆర్‌‌‌‌ను సీఎం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని, రాహుల్‌‌ను ప్రధాని చేయాలని సోనియా కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. 

తెలంగాణలో అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రకటించారని, ఆ హామీ ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. ఇప్పటికైనా దళితుడిని సీఎం చేస్తారా? అని నిలదీశారు. ‘‘దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, వారి సంక్షేమం కోసం రూ.50 వేల కోట్ల బడ్జెట్ పెడ్తానని ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయి? బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.10 వేల కోట్లతో ప్రత్యేక ప్లాన్ చేపడ్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయి? బీఆర్ఎస్ పార్టీ పేదల విరోధి. దళితుల విరోధి. బీసీల వ్యతిరేకి” అని మండిపడ్డారు.

బీసీల సంక్షేమం కోసం మోదీ సర్కారు కృషి

వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని అమిత్ షా చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి జాతీయ స్థాయిలో బీసీ కమిషన్​ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. తెలంగాణలో సమ్మక్క సారలమ్మల పేరిట జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారని చెప్పారు. ఎంతో కాలంగా రైతులు కోరుకుంటున్న పసుపు బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. కృష్ణా నీళ్ల గొడవకు మోదీ పరిష్కారం చూపించారని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు  రూ.9 వేల కోట్లు ఇస్తున్నదని వివరించారు. జల్ జీవన్​యోజన ద్వారా గ్రామాల్లో శుద్ధమైన నీళ్లను అందిస్తున్నామని తెలిపారు. పేదలందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని, రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఇస్తున్నామని అన్నారు. అయోధ్యలో అద్భుతమైన రామమందిరాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ప్రజలు తప్పక హాజరుకావాలని ఆహ్వానించారు.

అవినీతిపై పోరాటం.. మద్దతివ్వండి: కిషన్‌‌రెడ్డి

రాష్ట్రంలో అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రజలంతా మద్దతివ్వాలని, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతున్నదని, రాష్ట్రానికి కావాల్సింది ఫామ్‌‌హౌస్‌‌ సీఎం కాదని, ప్రజలకు అందుబాటులో ఉండే సీఎం కావాలని చెప్పారు.  ‘‘బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ వేర్వేరు కాదు. అవి రెండూ కవల పిల్లలు. వీటికి ఓటు వేస్తే మజ్లిస్‌‌కు వేసినట్లే. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌‌ఎస్‌‌లో చేరారు. కాంగ్రెస్‌‌ అమ్ముడుపోయే పార్టీ” అని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ నాయకత్వంలో 2,500 కిలోమీటర్ల కొత్త నేషనల్​ హైవేలను ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. విజయవాడ --హైదరాబాద్‌‌ నేషనల్ హైవేను ఆరు లైన్ల రహదారిగా మార్చడంతో పాటు ఇండస్ట్రియల్‌‌ కారిడార్‌‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే సూర్యాపేట రైల్వేలైన్ కలను సాకారం చేస్తామన్నారు. తొమ్మిదేండ్లలో ఎన్నికల హామీలను అమలు చేయని కేసీఆర్.. ఇప్పుడు కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. బీజేపీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో ఉచిత వైద్యం, విద్య అమలు చేస్తామన్నారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి, సూర్యాపేట అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు, తుంగతుర్తి అభ్యర్థి కడియం రామచంద్రయ్య, నాగార్జున్‌‌ సాగర్‌‌ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి, భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి, మహబూబాబాద్‌‌ అభ్యర్థి హుస్సేన్‌‌ నాయక్, సీనియర్ నేతలు గుజ్జుల ప్రేమేందర్‌‌ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, గొంగిడి మనోహర్‌‌ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, గట్టు శ్రీకాంత్‌‌ రెడ్డి, పోరెడ్డి కిశోర్‌‌ రెడ్డి, రుక్మారావు తదితరులు పాల్గొన్నారు.

బీసీ సీఎం నినాదంతోనే ముందుకు..

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. గురువారం రాత్రి పోలీసు అకాడమీలో కీలక నేతలతో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నేతలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్, రాజాసింగ్ ఉన్నారు. తర్వాత వీరితో విడివిడిగా కూడా భేటీ అయినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో ‘బీసీ సీఎం’ నినాదంతోనే జనంలోకి వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రం కూడా ఇదే కావాలని చెప్పినట్లు సమాచారం. బీసీ సంక్షేమం కోసం పార్టీ పని చేస్తుందనే సంకేతాలిచ్చేందుకు బీసీ సీఎంపై శుక్రవారం సూర్యాపేట సభలో ప్రకటిస్తానని అమిత్ షా స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట సభలో ఈ ప్రకటన చేసినట్లు రాష్ట్ర నేతలు చెప్తున్నారు.