
ఓయూ, వెలుగు: సంచార జాతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. సంచార జాతుల విముక్తి దినోత్సవ సందర్భంగా ఆదివారం ఓయూలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో సేవా భారతి, సంచార జాతుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంచార కళారూపాలు–జీవన తత్వాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టబోతున్న కులగణనలో సంచార జాతుల వారి కోసం ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని కోరానన్నారు.
సంచార జాతులపై స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 16 కమిషన్లు నివేదికలు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆరోపించారు. ననుమాస స్వామి, రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు, బట్కే విముక్త వికాస్ పరిషత్ చైర్మన్ సువర్ణ రావల్, దక్షిణ మధ్య సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ పాల్గొన్నారు.