కార్యకర్తలే తన బలం అని..ఉప ఎన్నిక వస్తే గెస్తానని ధీమా వ్యక్తం చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. తాను రాజీనామా చేయడానికి , ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి ధైర్యం తన కార్యకర్తలే అని చెప్పారు. వారి అండతోనే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ... ఉపఎన్నిక వస్తే కూడా గెలుస్తానన్నారు.
హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో దానం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి , కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇద్దరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారని... వాళ్ళు కేంద్ర మంత్రులా లేక రాష్ట్ర మంత్రులా స్పష్టత ఇవ్వాలన్నారు. హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ పరిధిలోనే దర్యాప్తు సంస్థలు ఉంటాయని... అవినీతిపై ఆధారాలు ఉంటే విచారణ చేపట్టాలని దానం తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం , ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని... మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని దానం నాగేందర్ సూచించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏక వచనంతో మాట్లాడింది బీఆర్ఎస్ నాయకులే అని దానం అన్నారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని , అది మరిచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ..లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. తాను కాంగ్రెస్ లో ఉన్నానని ఇటీవల దానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
