ఉదండాపూర్ నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఉదండాపూర్ నిర్వాసితులకు క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  •     ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి  

జడ్చర్ల టౌన్, వెలుగు : ఉదండాపూర్ నిర్వాసితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతే జిల్లాలో అడుగు పెట్టాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్​చేశారు. శుక్రవారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కలిసి తమ బాధలను చెప్పాలని వెళ్లిన ఉదండాపూర్ ప్రాజెక్టు​నిర్వాసితులను అరెస్ట్​చేయించారని గుర్తుచేశారు. 

కేసీఆర్ తాను కుర్చీ వేసుకొని కూర్చొని ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చి.. గాలికి వదిలేసారని మండిపడ్డారు. గతంలో నార్లాపూర్ కు వెళ్లి పాలమూరు-– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయిపోయిందని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టులో 70 శాతమే పూర్తయిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 

మరో 30 శాతం పనులు కాలేదని ఇప్పుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీటి నిల్వను పెంచడానికి రూ.32 వేల కోట్లు కేసీఆర్ కేటాయించారని తెలిపారు. పాలమూరు-– రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ కు  నిజంగా ప్రేముంటే కాళేశ్వరానికి కేటాయించిన రూ.32 వేల కోట్లు ఉదండాపూర్ రిజర్వాయర్, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇచ్చి ఉంటే.. అవి పూర్తయ్యేవని చెప్పారు. కేసీఆర్ అవలంభించిన ద్వంద్వ వైఖరి వల్ల పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. 

నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా వారిని రోడ్డు మీదికి తెచ్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాసితులకు పరిహారాన్ని దశలవారీగా చెల్లించడంతోపాటుగా పరిహారం మొత్తాన్ని అదనంగా రూ.145 కోట్లకు పెంచారని వెల్లడించారు.