దమ్ముంటే..కేసీఆర్ బీసీ బంధు ప్రకటించాలి : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

దమ్ముంటే..కేసీఆర్ బీసీ బంధు ప్రకటించాలి : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

నల్గొండ: ఉప ఎన్నికలు  అంటే టీఆర్ఎస్ నాయకులకు వెన్నులో వణుకు పుడుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కు ఉప ఎన్నికలు ఊపిరిపోశాయని..ఇప్పుడు రాష్ట్రంలో వచ్చిన బైపోల్స్  టీఆర్ఎస్ పాలిట శాపంగా మారాయని తెలిపారు. దీనంతటికీ టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనే కారణమన్నారు. కేసీఆర్ పాలనపై రాష్ట్రంలో వ్యతిరేకత మొదలైందని.. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించిందని తెలిపారు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపించారని కేసీఆర్ పై మండిపడ్డారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారని, అదే నిజమైతే  పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేయాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. డబ్బు, మద్యం పంచుతూ టీఆర్ఎస్ నేతలు మునుగోడు ప్రజలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటంగా లక్ష్మణ్ అభివర్ణించారు.

మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతుందని గ్రహించే కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు అంటూ డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ బంధు ప్రకటించాలని సవాల్ విసిరారు. ప్రతిపక్షాల సూచనలను పట్టించుకోని కేసీఆర్.. మునుగోడు ఎన్నిక కోసం కమ్యూనిస్టుల పంచన చేరారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ చెబుతున్నారన్న లక్ష్మణ్... మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలను కేటీఆర్ ఎందుకు దత్తత తీసుకోవడం లేదని నిలదీశారు. కేటీఆర్ దత్తత తీసుకుంటేనే అభివృద్ధి జరిగితే.. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దద్దమ్మలా అని ప్రశ్నించారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, ప్రజలు ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.