- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు
హైదరాబాద్, వెలుగు: బిర్సాముండా జీవితగాథని ప్రతీ భారతీయుడు తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి కేవలం 25 ఏండ్లకే ఆయన ప్రాణాలొదిలారని తెలిపారు. నవంబర్ 15న బిర్సా ముండా జయంతి – జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు చాలా రాజకీయ పార్టీలకు ఎన్నికలు అంటే కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికి ఒక సాధనం మాత్రమేనని అన్నారు.
బీజేపీ మాత్రం దేశ గౌరవం, స్వాతంత్ర్యం, దేశ సంస్కృతి, ధర్మాన్ని కాపాడేందుకు పోరాడిన మహనీయులను గౌరవించే సంప్రదాయంగా భావిస్తుందని తెలిపారు. మొఘల్స్, బ్రిటీషర్లపై, భారత నాగరిక విలువల కోసం పోరాడిన యోధుల జయంతిలను బీజేపీ ఎల్లప్పుడూ స్మరించుకుంటూ వస్తున్నదని చెప్పారు. ప్రతి భారతీయుడు బిర్సాముండా జీవిత గాథను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ‘జనజాతీయ గౌరవ దివస్ ’ గా ప్రకటించిందని పేర్కొన్నారు.
గిరిజన సంక్షేమం కోసం రూ.42 వేల కోట్ల కేటాయింపు
దేశంలో గిరిజనుల సంక్షేమం కోసం మోదీ సర్కారు ఈ ఏడాది రూ.42 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. బి ర్సా ముండా స్వాతంత్ర్యం, స్వదేశీ భావన, ఆత్మనిర్భరత కోసం పోరాడారని, ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించిందని వెల్లడించారు. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా బీజేపీ ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థలో గిరిజన నాయకత్వాన్ని బలోపేతం చేసిందన్నారు.
