- తరలిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు
- ఏడాది కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిందితులు
- వెంటపడి మహబూబ్‌నగర్ జిల్లాలో పట్టుకున్న
- బోయిన్పల్లి పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: కారులో హవాలా డబ్బు తరలిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ బోయిన్పల్లి పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.4.05 కోట్ల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నార్త్ జోన్ డీసీపీ సాధనా రష్మి పెరుమాళ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. గుజరాత్ కు చెందిన ప్రకాశ్ మోతీభాయ్ ప్రజాపతి(30), ప్రజ్ఞేష్ కీర్తి బాయి ప్రజాపతి (28) వివిధ రాష్ట్రాల నుంచి హవాలా డబ్బును ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తూ దందా కొనసాగిస్తున్నారు.
గతేడాది ( ఆగస్టు 2024) నాగోల్ కు చెందిన విశ్వనాథ్ చారి, తన స్నేహితులు ప్రదీప్, రవితో కలిసి ఆర్టీ జీఎస్ ద్వారా డబ్బుల మార్పిడి కోసం ప్రకాశ్, ప్రజ్ఞేష్ అనుచరుడు మహ్మద్ సుభాన్ పాషాను సంప్రదించారు. దీనికి తనకు రూ.50 లక్షలు ఇస్తే అందుకు ఆర్టీజీఎస్ ద్వారా రూ.60 లక్షలు ట్రాన్ఫర్ చేస్తానని చెప్పాడు. దీంతో ఈ ముగ్గురు కలిసి అతనికి రూ.50 లక్షలు ఇచ్చారు. అయితే, ఆర్టీజీఎస్ చేయక పోగా ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
దీంతో విశ్వనాథ్ చారి బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు మహ్మద్ సుభాన్ తో పాటు ప్రకాశ్, ప్రజ్ఞేష్ ను అరెస్టు చేసేందుకు ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొందరు వ్యక్తులు నాగ్ పూర్ నుంచి బెంగళూరు, గుజరాత్ కు సుమారు 4 కోట్ల రూపాయల హవాలా డబ్బు తరలిస్తున్నట్టు శుక్రవారం బోయిన్పల్లి పోలీసులకు అందిన పక్కా సమాచారంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మాటువేశారు.
పోలీసులను గమనించిన నిందితులు పారిపోతుండగా వారి వాహనాలను పోలీసులు 11 కి.మీ. చేజ్ చేసి మహబూబ్‌నగర్ జిల్లా అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. అనంతరం వారి వాహనాలను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి తనిఖీలు నిర్వహించారు. అందులో కారు డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన 4 కోట్ల ఐదు లక్షల రూపాయలు కనిపించాయని డీసీపీ తెలిపారు. సీజ్ చేసిన డబ్బును ఐటీ అధికారులకు అప్పగిస్తామని ఆమె తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్టు డీసీపీ తెలిపారు.
