
- మండలిలో బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన.. బీసీ రిజర్వేషన్సహా బిల్లులను అడ్డుకున్న సభ్యులు
- గొడవ మధ్యే బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య పోటాపోటీ నినాదాలు
- సభ్యుల తీరుపై మంత్రుల ఆగ్రహం, చైర్మన్ అసహనం
హైదరాబాద్, వెలుగు: అధికార, ప్రతిపక్షాల ఆందోళనలతో శాసనమండలిలో సోమవారం తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మండలి ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పోడియం ముందు నిరసనకు దిగారు. నల్లకండువాలు వేసుకుని ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాపీలను చించి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీదకు విసిరారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, దాసోజు శ్రవణ్, నవీన్ రెడ్డి, శంభీపూర్ రాజు, దేశపతి శ్రీనివాస్, బండ ప్రకాశ్ సహా పోడియంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు.
దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పోడియంలోకి దూసుకొచ్చిన బీఆర్‌ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. ఓ దశలో సభ్యులు వారిని హెచ్చరించారు. నిరసన తెలిపే హక్కు తమకు ఉందని మార్షల్స్ బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కలుగజేసుకుని మార్షల్స్‌ను వెనక్కి రావాలని వారించారు. బీఆర్‌ఎస్ సభ్యులు కూడా పోడియం నుంచి వెనక్కి వెళ్లి తమతమ స్థానాల్లో ఉండి నిరసన తెలపాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా బీఆర్‌ఎస్ సభ్యులు పట్టించుకోకుండా ఆందోళన తీవ్రతరం చేశారు.
ఆందోళనల మధ్యే బిల్లులకు ఆమోదం తెలిపిన సభ
బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, పురపాలక సంఘాల చట్ట సవరణ, అల్లోపతి ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులకు మండలి ఆమోద ముద్ర వేసింది. ఆందోళనల మధ్యే మంత్రులు మండలిలో బిల్లులు ప్రవేశపెట్టారు. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ చేస్తూ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అదేవిధంగా పురపాలక సంఘాల చట్ట సవరణ బిల్లును శ్రీధర్‌బాబు, అల్లోపతి ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లును దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులకు సభ ఆమోద ముద్ర వేసింది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యుల పోటాపోటీ నినాదాలు
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై బీఆర్‌ఎస్ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, శంబీపూర్‌రాజు, నవీన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, దేశపతి శ్రీనివాస్ చైర్మన్ పోడియం వద్దకు దూసుకువచ్చి నినాదాలిచ్చారు.
దీంతో చైర్మన్ వారించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో జరిగిన అన్ని చర్చలు మండలిలో జరిగే అవకాశాలు ఉండవన్నారు. అయినప్పటికీ సభ్యుల ఆందోళన ఆగలేదు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా ‘కేసీఆర్ వద్దు.. బీసీలు ముద్దు’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ నినాదాలు చేశారు. బిల్లులు ఆమోదం పొందిన వెంటనే శాసన మండలిని నిరవదికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళనలపై మంత్రుల ఆగ్రహం
సభలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన బీఆర్ఎస్‌కు జై తెలంగాణ మాట పలికే అర్హత లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో టీఆర్‌ఎస్ బంధం తెగిపోయిందన్నారు. కాగా, బీసీ బిల్లు సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన చేస్తుండగా మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగజేసుకుంటూ, బీసీల అంశం చర్చకు వస్తే.. ఇలా అడ్డుపడటం సరికాదన్నారు.
కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారని, బీసీ రిజర్వేషన్ లను అడ్డుకునే కుట్ర దౌర్భాగ్యమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడారు.. బీసీల గోడువెళ్ల బోసుకుంటుంటే బీఆర్‌ఎస్ సభ్యులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేనందున 634 మంది ప్రజాప్రతినిధులు నష్టపోయారన్నారు. 70 యేండ్లుగా రాజకీయాల్లో బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు తీసుకొస్తే సరిపోదు, అమలులోకి వచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.