చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ

చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ

హైదరాబాద్, వెలుగు:  టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఆదివారం విజయవాడ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ దాదాపు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంశంపై ఈ సమావేశంలో వారిద్దరూ చర్చించారు.

సీట్ల సర్దుబాటుపై దాదాపుగా పూర్తి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి?  ఏ నియోజకవర్గంలో, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అయితే, రాజోలు, రాజానగరం సెగ్మెంట్లలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు.

మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైనా చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలిసింది. జనసేనకు 25 నుంచి 30 స్థానాలు కేటాయించాలని ఈ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, తమ వైపు నుంచి ఆశావహులు భారీగా ఉన్నారని, ఇంకొన్ని స్థానాలు కేటాయించాలని చంద్రబాబును పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 50 శాతం షేర్ ఉండాలని జనసేన చెబుతున్నట్లు సమాచారం. విశాఖలోనూ పార్టీ బలంగా ఉందని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.