గోశాల నిర్వాసితులకు స్థలాలతో పాటు ఉద్యోగాలు

గోశాల నిర్వాసితులకు స్థలాలతో పాటు ఉద్యోగాలు
  • హెచ్ఎండీఏ లేఅవుట్​లో సకల సౌకర్యాలతో ప్లాట్లు
  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, వెలుగు: ఎన్కేపల్లి గోశాల  నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్లాట్లతో పాటు ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగాలూ ఇస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హామీ ఇచ్చారు. ఎకరానికి 300 గజాల చొప్పున స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లోని ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణంలో భూములు కోల్పోతున్న పలువురు రైతులకు మంగళవారం ప్లాట్లకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్​ఎండీఏ లేఅవుట్​లో అన్ని  సౌలతులతో ప్లాట్లను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. 

ఈ ప్లాట్లకు త్వరలోనే మంచి డిమాండ్​ వస్తుందని  చెప్పారు. ప్లాట్లు పొందిన రైతులకు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తామని మాటిచ్చారు. ఎన్కేపల్లి ప్రాంతంలో వెటర్నరీ  యూనివర్సిటీ కూడా రాబోతుందని, భూములు ఇచ్చిన రైతులకు అందులో ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్​రెడ్డి, చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, తసీల్దార్ గౌతంకుమార్​ తదితరులు పాల్గొన్నారు.

కొందరికే ఎలా ఇస్తారు?

గోశాల నిర్వాసితుల్లో కొందరికి మాత్రమే స్థలాల పట్టాలు ఇచ్చారని, ఒకేసారి అందరిని ఒప్పించి ఇస్తే బాగుండేదని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. రైతులకు ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేస్తున్న విషయం తెలుసుకున్న ఆయన పలువురు రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.